ఊరిస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్

1 Jul, 2014 01:54 IST|Sakshi
ఊరిస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్
  • భర్తీకాని 2013 నాటి పోస్టులు
  •  పెరగనున్న పోస్టుల సంఖ్య  
  •  ఎస్‌జీటీలుగా బీఎడ్‌లకు అవకాశమిస్తారా?
  • హనుమాన్‌జంక్షన్ : రెండేళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగార్థులను ఎంతగానో ఊరిస్తున్న డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.  సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10,500 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలపటంతో జిల్లాలోని బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన విద్యార్థుల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది.

    జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 2 వేలకు పైబడి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇప్పటికే డీఎస్సీ-2013 నోటిఫికేషన్ ద్వారా 845 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వ హాయంలో నోటిఫికేషన్ జారీ అయింది. ఆ తర్వాత సమైక్య ఉద్యమం ఉధృతం కావడం, రాష్ట్ర విభజన జరగడంతో డీఎస్సీ-2013 నిర్వహణ నిలిచిపోయింది. ఐతే డీఎస్సీ -2013 నోటిఫికేషన్‌లో ప్రకటించిన ప్రకారమే పోస్టుల సంఖ్య ఉంటుందా ? లేదా తాజా నోటిఫికేషన్‌లో పోస్టులు పెరుగుతాయా? అనేది అభ్యర్థుల్లో ఆత్రుత  కలిగిస్తుంది.
     
    పెరిగిన ఖాళీలు....
     
    జిల్లాలోని మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, జడ్పీ హైస్కూళ్లలో ఈ విద్యా సంవత్సరం ఆరంభం నాటికి ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల సంఖ్య దాదాపు 2 వేలకు పైబడి ఉన్నట్లు తెలుస్తోంది. గడచిన రెండేళ్లుగా డీఎస్సీ ప్రకటన లేకపోవడం, దాదాపు 500 మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయటంతో ఖాళీల సంఖ్య పెరిగిందని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు.

    అంతేకాక ఎనిమిదో తరగతికి అప్‌గ్రేడ్ చేసిన ప్రాథమిక్నోత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కొత్తగా మంజూరు చేయాల్సి ఉందని, దీనిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా పోస్టుల సంఖ్య ఉంటుందని చెబుతున్నారు. అప్‌గ్రేడ్ ప్రాధమిక్నోత పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ టీచర్ల పోస్టులను అదనంగా మంజూరు చేస్తే జిల్లాలో కొత్తగా దాదాపు 500 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరుగుతాయని అంచానా వేస్తున్నారు. ఖాళీ పోస్టుల్లో సుమారు 80 శాతం వరకు డీఎస్సీ-2014 ద్వారా భర్తీ చేయవచ్చని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

    బీఈడీ విద్యార్థులకు ఎస్‌జీటీ అవకాశమిస్తారా?
     
    బీఈడీ విద్యార్థులకు  సెంకడ్ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని టీడీపీ ఎన్నికల తరుణంలో హామీ ఇచ్చింది. దీంతో డీఎస్సీ-2014 నోటిఫికేషన్‌లో డీఈడీ విద్యార్థులతో పాటుగా ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ విద్యార్థులకూ అవకాశం ఇస్తారని ఎంతో ఆశతో ఉన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక విద్య బోధించేందుకు కనీసం రెండేళ్ల కాలపరిమితి ఉన్న ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన వాళ్లే అర్హులనే నిబంధన ఉండటంతో సెంకడ్ గ్రేడ్ టీచర్ పోస్టుల్లో బీఈడీ విద్యార్థులకు ఎలా అవకాశం కల్పిస్తారని మరో పక్క డీఈడీ విద్యార్థులు వాదిస్తున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోననే అందోళన బీఈడీ విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది.
     

>
మరిన్ని వార్తలు