ఇక ఆన్‌లైన్‌లో ఎంట్రన్స్!: టి.రవిరాజు

26 Mar, 2014 02:58 IST|Sakshi
ఇక ఆన్‌లైన్‌లో ఎంట్రన్స్!: టి.రవిరాజు

పీజీ మెడికల్ పరీక్షా విధానంలో  సమూల మార్పులు చేస్తాం: వీసీ టి.రవిరాజు

సాక్షి, విజయవాడ: పీజీ వైద్య ప్రవేశ పరీక్షా విధానంలో సమూల మార్పులు తెస్తామని, భవిష్యత్తులో ఆన్‌లైన్‌లో ఎంట్రన్స్ నిర్వహిస్తామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఈ ఎంట్రన్స్ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడం, సీఐడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ నరసింహన్ ఆదేశాల మేరకు ఎంట్రన్స్ నిర్వహణపై ఇటీవల ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి కమిటీ విచారణ జరిపిందన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ సీఐడీ విచారణకు ఆదేశించారని, ఆరోపణలు వచ్చినందున విచారణ చేయాలని కోరుతూ తాము హైదరాబాద్‌లో పోలీసు కేసు నమోదు చేశామని తెలిపారు. సీఐడీ అధికారులు యూనివర్సిటీలో విచారణ జరుపుతున్నారని, ఇప్పటివరకు ఎవ రినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. పీజీ మెడికల్ ఎంట్రన్స్ నిర్వహణలో రిజిస్ట్రార్ పాత్ర ఉండదని, మోడరేటర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పర్యవేక్షిస్తారని వివరించారు. ప్రశ్నపత్రాల ముద్రణ ఇతర రాష్ట్రాల్లో జరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రైవేటు ప్రెస్‌లోనే ప్రింటింగ్ జరిగిందన్నారు.
 
 పరీక్ష మొదలయ్యేందుకు ఒకటి రెండురోజులు ముందు మాత్రమే ప్రశ్నపత్రాలు యూనివర్సిటీకి వస్తాయని, ఇక్కడి అధికారులు వాటిని వైద్య కళాశాలలకు పంపుతారని తెలిపారు. ఈ పరీక్షలో 12వ ర్యాంకర్ జగదీష్ నిర్ధాలాపై ఎంబీబీఎస్‌లో అవకతవకలకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. చైనా, ఉక్రేనియూ దేశాల్లోని కళాశాలల్లో చదివిన విద్యార్థులకు 100లోపు ర్యాంకులు రావడంపై కూడా అనుమానాలున్నాయన్నారు. ప్రవేశ పరీక్ష తిరిగి నిర్వహించాలో? లేదో గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని రవిరాజు చెప్పారు.

మరిన్ని వార్తలు