ఇకపై గంటలోపే శ్రీవారి దర్శనం

30 Jul, 2014 03:44 IST|Sakshi
ఇకపై గంటలోపే శ్రీవారి దర్శనం

సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో గంటకు 4200 మంది భక్తులకు తగ్గకుండా  అన్ని రకాల దర్శనాలను శాస్త్రీయ పద్ధతిలో అనుమతించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు మంగళవారం తెలిపారు. దీనివల్ల రూ.300 టికెట్లను ఆన్‌లైన్, ఈ-దర్శన్‌లో టైంస్లాట్‌లో కేటాయించినప్పటికీ అన్ని క్యూలు ఏకకాలంలోనే కొనసాగే వీలుంటుందని చెప్పారు. కంపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన భక్తుడికి గంటలోపే స్వామి దర్శనం లభించేలా ప్రత్యేకంగా ‘కోరమాండల్ ఇన్ఫోటెక్’ సంస్థ ద్వారా సాఫ్ట్‌వేర్ రూపకల్పన చేశామన్నారు. శ్రావణమాసంలో ఆగస్టు 8, 9, 10వ తేదీలు, తిరిగి 15, 16, 17వ తేదీల్లో వరుస సెలవు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు జేఈవో వెల్లడించారు. ఆ రోజుల్లో ప్రొటోకాల్ వీఐపీలను మాత్రమే అంగీకరించనున్నామన్నారు.
 
 శ్రీవారి దర్శనానికి 24 గంటలు
 తిరుమలలో మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది.  సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండిపోయారు.  వీరికి 24 గంటలు, కాలిబాట మార్గాల్లో వచ్చిన వారికి 8 గంటలు, రూ. 300 టికెట్ల భక్తులకు 6 గంటల  తర్వాత దర్శనం లభించనుంది. శ్రీవారి హుండీ ఆదాయం సోమవారం రూ. 3.59 కోట్లు, మంగళవారం కూడా రూ.3.47 కోట్లు లభించింది. సాధారణంగా జూలై నెలలో రూ. 3 కోట్లుపైబడిన సందర్భాలు అరుదు.  
 
 గిరిజనులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం
 వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామాలు, తండాలకు చెందిన 250 మంది గిరిజనులు మంగళవారం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కాకినాడలోని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో వచ్చిన వీరిని టీటీడీ ప్రత్యేకంగా సుపథం మార్గం ద్వారా ఆలయానికి తీసుకెళ్లారు.  కాగా, తిరుపతిలో వకుళమాత ఆలయం నిర్మించేంతవరకు తాను శ్రీవారిని దర్శించుకోనని పరిపూర్ణానంద మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం ఆలయ సమీపంలోని ఆస్థాన మండపం వరకు మాత్రమే పరిపూర్ణానంద వచ్చి తిరిగి వెళ్లిపోయారు.
 
 తిరుమలకు ‘గంగ’ కోటా పెంపు
 శ్రీవారి భక్తుల దాహార్తి తీర్చేందుకు  తెలుగుగంగ నీటి కోటాను పెంచారు. మంగళవారం నుంచి రోజుకు 50 లక్షల లీటర్ల (5 ఎంఎల్‌డీ) నీరు సరఫరా చేస్తున్నారు. రోజుకు 10 ఎంఎల్‌డీ (కోటి లీటర్లు) తెలుగుగంగ నీటిని టీటీడీ అవసరాలకు(తిరుమల, తిరుపతికి) తరలించేందుకు ప్రభుత్వం, టీటీడీ మధ్య గతంలో ఒప్పందం కుదిరింది. జలాశయాలు ఎండిపోవటంతో  మంగళవారం నుంచి ఆ మేరకు విడుదల చేస్తున్నారు.

మరిన్ని వార్తలు