రోడ్డు ప్రమాదంలో ఎన్‌ఆర్‌ఐ దుర్మరణం

17 Dec, 2017 12:08 IST|Sakshi

ఆయన సోదరుడికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

మృతుడు ఒమన్‌లో.. క్షతగాత్రుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు

నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు

 వీరి స్వగ్రామం బల్లికురవ మండలం కూకట్లపల్లి  

అద్దంకి: రోడ్డు ప్రమాదంలో ఓ ఎన్‌ఆర్‌ఐ దుర్మరణం చెందగా ఆయన తమ్ముడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మండలంలోని చిన్నకొత్తపల్లి సమీపంలో అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై శనివారం జరిగింది. బంధువుల కథనం ప్రకారం.. బల్లికురవ మండలం కూకట్లపల్లికి చెందిన అన్నంనేని కాంతారావుకు ఇద్దరు కుమారులు, కుమార్తె ప్రసన్న లక్ష్మి ఉన్నారు. ముగ్గురికీ వివాహాలయ్యాయి. పెద్ద కుమారుడు వేణు (45) ఉమన్‌ దేశంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. చిన్న కుమారుడు సుబ్బారావు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వేణు 15 రోజుల క్రితం నెల రోజులు సెలవు పెట్టుకుని భార్య హిమబిందు, కుమారుడితో కలిసి ఒమన్‌ నుంచి స్వగ్రామం వచ్చాడు. తమ్ముడు సుబ్బారావు కూడా బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ బైకుపై అద్దంకి వెళ్లారు. బ్యాంకు పని చూసుకుని తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు.

చిన్నకొత్తపల్లి సమీపంలో నరసరావుపేట వైపు నుంచి వేగంగా వచ్చిన కారు (ఏపీ 27ఏజే 6161) డివైడర్‌ను ఢీకొట్టి అంతే వేగంతో బైకునూ ఢీకొట్టింది. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్, అందులో ఉన్న వారు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న హైవే అంబులెన్స్‌ సిబ్బంది క్షతగాత్రులను హుటాహుటిన నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. అక్కడ చికత్స పొందుతూ వేణు మృతి చెందాడు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న సుబ్బారావు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ సుబ్బరాజు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎక్కడి నుంచి వస్తోంది.. అందులో ఎవరున్నారనే విషయాలు తెలియరాలేదు.

శోకసంద్రంలో కుటుంబం
రోడ్డు ప్రమాదంలో అన్న మృతి చెందడంతో పాటు తమ్ముడు తీవ్రంగా గాయపడిన ఘటనపై తల్లిదండ్రులు, సోదరి ప్రసన్న లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రులతో గడిపేందుకు వచ్చి ప్రమాదానికి గురి కావడంతో బంధువులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కుమారులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారని మాత్రమే తల్లికి తెలుసు. పెద్ద కుమారుడు చనిపోయిన విషయాన్ని బంధువులు ఆమెకు ఇంకా చెప్పలేదు. విషయం తెలిసి తండ్రి కుప్పకూలాడు.   
 

మరిన్ని వార్తలు