ఉపాధి కోసం వెళ్లి.. విగతజీవిగా తిరిగొచ్చాడు!

25 Feb, 2016 00:45 IST|Sakshi

బొబ్బిలి: ఉపాధి కోసం ఊరొదిలి వెళ్లాడు. చివరికి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. మూడు రోజులపాటు శిక్షణ కూడా తీసుకున్నాడు. జాయినింగ్ ఆర్డర్స్ తీసుకోవాల్సిన రోజునే మృత్యువు అతడిని కబళించింది. బొబ్బిలి పట్టణం దావాలవీధికి చెందిన కింత లి శ్రీనివాసరావు (38) హైదరాబాద్ లో మూడు రోజుల కిందట వాహనం ఢీకొని మృత్యువాత పడ్డాడు. రిటైర్డు హెచ్‌ఎం కింతలి భాస్కరరావు కుమారుడైన శ్రీనివాసరావు ఐటీఐ పూర్తి చేశాడు. అనంతరం డీఎస్సీకి ప్రిపేరయ్యాడు.
 
 సరిపడా ర్యాంకు రాకపోవడంతో.. వేరే ఉపాధి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ క్రమంలో హైదరాబాద్‌లోని మెగా ఇంజినీరింగ్ ఇన్ఫోస్ట్రెక్చర్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దాని కోసం ఈ నెల 17న బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడ మూడు రోజుల పాటు శిక్షణ తీసుకున్నాడు. సోమవారం జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తారని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.
 
  ఆదివారం సినిమాకు వెళ్లి తిరిగొస్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. శ్రీనివాసరావు మృతి చెందినట్లు బొబ్బిలిలో ఉంటున్న కుటుంబ సభ్యులకు సోమవారం సమాచారం అందింది. అతని మృతదేహాన్ని బుధవారం బొబ్బిలికి తీసుకువచ్చారు. కాగా, మృతుడు శ్రీనివాసరావుకు భార్య మణి, కుమారుడు హర్షిత్ ఉన్నారు. ఉపాధి కోసం వెళ్లి విగతజీవిగా తిరిగిరావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.
 

>
మరిన్ని వార్తలు