విదేశాల్లో చదువు.. స్వదేశంలో సేవ

13 Aug, 2019 10:08 IST|Sakshi
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న శౌరీస్‌ జాస్తి, రాహుల్‌ 

సాక్షి, పశ్చిమగోదావరి : విదేశాల్లో చదువుతూ స్వదేశంలో సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులు. విజయవాడకు చెందిన శౌరీస్‌ జాస్తి (ఇంటర్‌ మొదటి సంవత్సరం), హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌ (10వ తరగతి) న్యూజెర్సీలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థులు పనికిరాని వ్యర్థపదార్థాలతో వాటర్‌ ప్యూరిఫైర్‌ ప్రక్రియను తయారు చేశారు. వీరు తయారు చేసిన ఈ ప్రక్రియకు మెచ్చి న్యూజెర్సీలోని అకాడమి సంస్థలు  ఇండియన్‌ కరెన్సీ రూపంలో రూ.42 లక్షలు ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. ఈ నగదుతో సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో వాటర్‌ శానిటేషన్‌ కార్యక్రమంలో భాగంగా శౌరీస్‌ జాస్తి, రాహుల్‌లు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నీటిశుద్ధి పరికరాలను పంపిణీ చేస్తున్నారు. వీరు అందిస్తున్న నీటిశుద్ధి పరికరం రూ.3 వేలు. ఇప్పటివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 50 ప్రభుత్వ పాఠశాలలకు నీటిశుద్ధి పరికరాలు పంపిణీ చేశారు.

జంగారెడ్డిగూడెం మండలంలో కూడా ప్రభుత్వ పాఠశాలలకు ఈ నీటిశుద్ధి పరికరాలు అందజేయాలని మైసన్నగూడెం ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం పీవీ నాగమౌళి వారిని కోరారు. వెంటనే స్పందించిన శౌరీస్‌ జాస్తి, రాహుల్‌లు జంగారెడ్డిగూడెం మండలంలోని 15 ప్రభుత్వ పాఠశాలలకు నీటిశుద్ధి పరికరాలను ఉచితంగా అందజేశారు. విద్యార్థి దశలోనే వీరిద్దరు చేస్తున్న సేవలకు విద్యాశాఖాధికారులతో పాటు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. శౌరీస్‌ జాస్తి, రాహుల్‌ మాట్లాడుతూ తాగే నీరు పరిశుభ్రంగా ఉన్నప్పుడే రోగాలు దరిచేరవని, ప్రభుత్వ పాఠ«శాలలను ఎంచుకుని నీటిశుద్ధి పరికరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. మున్ముందు పేద విద్యార్థులు చేరువయ్యే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని విద్యార్థులు చెప్పుకొచ్చారు. 

విద్యార్థుల సేవ భేష్‌
విద్యార్థి దశలోనే శౌరీస్‌ జాస్తి, రాహుల్‌లకు సేవాదృక్పథం కలగడం నిజంగా అభినందించాల్సిందే. నా కోరిక మేరకు ఈ విద్యార్థులు మండలంలో ప్రభుత్వ పాఠశాలలకు నీటి శుద్ధి పరికరాలు అందిచేందుకు ముందుకు రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. సేవలోనే ఆత్మ సంతృప్తి ఉందని ఈ విద్యార్థులు చేస్తున్న సేవలు అభినందనీయం 
పీవీ నాగమౌళి, హెచ్‌ఎం, మైసన్నగూడెం ప్రభుత్వ పాఠశాల 

మరిన్ని వార్తలు