కువైట్‌ నుంచి ప్రవాసాంధ్రుల రాక

23 May, 2020 05:55 IST|Sakshi
లాక్‌డౌన్‌ కారణంగా కువైట్‌లో చిక్కుకుపోయిన వారిని గన్నవరం తీసుకొచ్చిన విమానం

ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 150 మంది

సౌదీ నుంచి 58 మంది ప్రవాసాంధ్రుల రాక

రేణిగుంటకు చేరుకున్న మరో 150 మంది

విశాఖకు 62 మంది చేరిక  

గన్నవరం/తిరుపతి అన్నమయ్య సర్కిల్‌/ఎన్‌ఏడీ జంక్షన్‌ (విశాఖ): కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌తో విదేశాల్లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు, ప్రవాసాంధ్రులను రాష్ట్రానికి రప్పించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో కువైట్, సౌదీ అరేబియా, మలేసియాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక విమానాలు, ఎయిర్‌ ఇండియా విమానాల ద్వారా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాలకు చేరుకున్నారు. కువైట్‌ నుంచి జజీరా ఎయిర్‌వేస్‌కు చెందిన ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం 150 మంది వలస కార్మికులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్‌లో వీరందరికి వైద్యసిబ్బంది మెడికల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో వారిని గూడవల్లి సమీపంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు.
గన్నవరం విమానాశ్రయంలో ప్రవాసాంధ్రులకు టెస్టులు చేస్తున్న వైద్య సిబ్బంది  

► సౌదీ అరేబియాలోని రియాద్‌ నుంచి 58 మంది ప్రవాసాంధ్రులు ఎయిరిండియాకు చెందిన ప్రత్యేక విమానంలో శుక్రవారం రాత్రి గన్నవరం చేరుకున్నారు.
► కువైట్‌ నుంచి మరో 150 మంది ప్రవాసాంధ్రులు ఎయిర్‌ ఇండియా విమానంలో గురువారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్‌ చేరారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌లో నిలిచిపోగా, మిగతా 149 మంది శుక్రవారం తెల్లవారుజామున 1.50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించాక వీరిలో వైఎస్సార్‌ జిల్లాకు చెందిన 116 మందిని, తూర్పుగోదావరి 6, పశ్చిమగోదావరి 5, విశాఖ 4, నెల్లూరుకు చెందిన ఆరుగురిని, కృష్ణా జిల్లాకు చెందిన ఒకరిని ఆయా జిల్లాల్లోని క్వారంటైన్‌ సెంటర్లకు బస్సుల్లో తరలించారు. మిగిలిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన ఏడుగురిని, చెన్నైకి చెందిన ఒకరిని, కర్నూలు జిల్లాకు చెందిన ఒకరిని, అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరిని తిరుపతిలోని క్వారంటైన్‌ సెంటర్‌కు పంపించారు. 
► మలేసియా నుంచి ఢిల్లీ మీదుగా విశాఖకు ఎయిరిండియా విమానంలో శుక్రవారం రాత్రి 11 గంటలకు  62 మంది చేరుకున్నారు. వీరిలో కర్నూలుకు చెందిన ఒకరు, తూర్పుగోదావరి 4, పశ్చిమగోదావరి 6, గుంటూరు 12, కృష్ణా 7, నెల్లూరు 2, ప్రకాశం 2, శ్రీకాకుళం 6, విజయనగరం 4, విశాఖపట్నం 15, ఇతర ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురు ఉన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు