టమాటో చాలెంజ్‌..

29 May, 2020 12:52 IST|Sakshi
రైతు భరోసా కేంద్రం వద్ద కూరగాయల ప్యాకింగ్‌

నెల్లూరు, మనుబోలు: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న రైతన్నలను ఆదుకునేందుకు ఎన్నారైలు వినూత్న యత్నం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో టమాటో రైతులు నష్టపోతున్న విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న వారు ఓ చాలెంజ్‌ విసిరారు. నష్టపోతున్న రైతన్నలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. భారీ ఎత్తున వాటిని కొనుగోలు చేశారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న ఇతర జిల్లాల వాసులకు కూడా ఉచితంగా పంపిణీ చేసి తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. జిల్లాలోని మనుబోలులో గురువారం ఈ ఘటన జరిగింది. వివరాలు.. లాక్‌డౌన్‌ సమయంలో గిట్టుబాటు ధర లభించకపోవడం, విక్రయాలు జరగకపోవడంతో చిత్తూరు జిల్లాలో టమాటో రైతులు ఇబ్బందులు పడుతున్న అంశం సోషల్‌ మీడియాలో వైరలైంది. ఈ క్రమంలో అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఫర్‌ ఫార్మర్స్‌ (ఏటీఏఎఫ్‌ఎఫ్‌) సభ్యులు టమాటో రైతుల కష్టాలను తెలుసుకొని వారిని ఆదుకునేందుకు ఓ చాలెంజ్‌ విసిరారు.

దీనికి పలువురు ఎన్నారైలు స్పందించారు. చిత్తూరు జిల్లాలో రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. వీటిని ప్రజల అవసరాల మేరకు ఇతర జిల్లాలకు కూడా తరలించి పేదలను ఆదుకుంటున్నారు. టమాటోలతో పాటు ఉల్లిపాయలు, క్యారెట్, వంకాయలను కలిపి నాలుగు టన్నుల కూరగాయలను మనుబోలులోని రైతుభరోసా కేంద్రానికి తరలించారు. వీటిని ప్యాకింగ్‌ చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల ఆధ్వర్యంలో స్థానిక సీఎం నగర్, ఎరుకల కాలనీ, అరుంధతీయవాడల్లో ఉచితంగా పంపిణీ చేశారు. పొదలకూరు మండలంలోనూ కూరగాయలను అందజేశారు. రాష్ట్రంలో రైతు సంక్షేమ రాజ్యాన్ని తెచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎన్నారైలు తెలిపారు. జిల్లాకు చెందిన ఎన్నారైలు చింతగుంట సుబ్బారెడ్డి, ప్రేమ్‌కల్యాణ్‌రెడ్డి కూరగాయల కొనుగోలు, పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి గుంజి రమేష్, గిద్దంటి రమణయ్య, బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, చిట్టమూరు అజయ్‌రెడ్డి, చల్లా రవీంద్ర, నవకోటి, భాస్కర్‌గౌడ్, భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు