కోడ్‌ కూసింది..నిరాశే మిగిలింది..!

12 Mar, 2019 12:16 IST|Sakshi
ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం

ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ రుణాల జాబితా ప్రకటించకపోవడంపై అభ్యర్థుల ఆవేదన

ఎన్నికల కోడ్‌ వచ్చే వరకు నిర్లక్ష్యం చేయడంపై దళిత సంఘాల ఆగ్రహం

చైర్మన్‌ జూపూడిపై లబ్ధిదారుల మండిపాటు

ఒంగోలు టూటౌన్‌: జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. మూడు నెలలుగా రుణాల జాబితా కోసం ఎదురుచూసినా ఫలితం పోవడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ వచ్చే వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించకపోవడంతో దళిత సంఘాల నాయకులు సైతం మండిపడుతున్నారు. జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అమలు చేస్తున్న ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ రుణాలకు సంబంధించిన యూనిట్లను 350 వరకు ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ నిరుద్యోగులు రుణాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకానికి 6,892 దరఖాస్తు చేసుకోగా, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకానికి 1143 మంది, వల్నరబుల్‌ పథకాలకు సంబంధించి 2,326 మంది దరఖాస్తు చేసుకున్నారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్‌ చివర్లో స్థానిక టీటీడీసీలో ముఖాముఖి నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అప్పటి నుంచి రుణాలకు ఎంపికైన జాబితా ప్రకటన కోసం అభ్యర్థులు ఎదురుచూడని రోజు లేదు. నిత్యం కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తూనే ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు నియమించిన ఇన్‌చార్జి ఈడీ సైతం కార్యాలయానికి రాకపోవడం, కార్యాలయంలో సమాధానం చెప్పేవారు లేకపోవడంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తిలో కొట్టుమిట్టాడారు. అయినా జిల్లా అధికారులు సైతం పట్టించుకోలేదు. ఎన్నికల కోడ్‌ వస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళన ప్రతి అభ్యర్థులో నెలకొంది. చివరకు ఆదివారం ఎన్నికల కోడ్‌ రానే వచ్చింది. దీంతో లబ్ధిదారులు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.250 కోట్లు నిధులు కేటాయించామని ఊదరకొడుతున్న చైర్మన్‌ జూపూడి ప్రభాకరరావుపైనా అటు అభ్యర్థులు, ఇటు దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లు కేటాయించామని చెప్పడమే కానీ కనీసం అభ్యర్థుల జాబితా ప్రకటనకు చర్యలు ఎందుకు తీసుకోలేదని పలువురు బాధితులు  ప్రశ్నిస్తున్నారు. ఈ రుణాల పరిస్థితి ఇలా ఉంటే 2017–18 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన రుణాల్లో అనేక అవకతవకలు జరగటంపై అప్పటి ఈడీ జయరాంను సస్పెండ్‌ చేశారు. అప్పటినుంచి ఈ ఏడాద రుణాల వరకు ఓ కొలిక్కి రాని పరిస్థితి ఉంది.

మరిన్ని వార్తలు