కేంద్ర విద్యుత్‌కు కొరివి

7 Mar, 2019 04:30 IST|Sakshi

ఎన్టీపీసీ విద్యుత్‌ నిలిపివేత

బకాయిలు చెల్లించే వరకూ అంతే

రాష్ట్రానికి నోటీసులు... పట్టించుకోని సర్కార్‌

ఇదే అదనుగా ప్రైవేటు కొనుగోలు నాటకం

రూ.4 విద్యుత్‌ వదిలేసి..రూ.6కు కొనుగోలు

సాక్షి, అమరావతి: ముడుపుల కోసం టీడీపీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందనేందుకు అతి తక్కువకు లభించే కేంద్ర విద్యుత్‌ను వదిలేసి.. ‘ప్రైవేటు’ సంస్థలనుంచి అధిక రేటుకు కొనుగోలు చేయడానికి సమాయత్తమవ్వడమే నిదర్శనంగా నిలుస్తోంది. తమకు బకాయిపడ్డ రూ.3,768 కోట్లు చెల్లించిన తర్వాతే విద్యుత్‌ సరఫరాపై మాట్లాడాలని కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) ఆంధ్రప్రదేశ్‌కు నోటీసులు పంపినా.. ప్రభుత్వం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బకాయిలు చెల్లించేవరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్టు నోటీసుల్లో పేర్కొంది. ఈ విషయాన్ని గతంలోనే తెలియజేసినా పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోవడం అనివార్యమైందని తెలిపింది. కాగా, ఇంత సీరియస్‌గా హెచ్చరించినా ఏమాత్రం స్పందించకపోవడం విద్యుత్‌ వర్గాలనే విస్మయ పరుస్తోంది. ఎన్టీపీసీ విద్యుత్‌ ఆగిపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిసింది.

కేంద్ర విద్యుత్‌ నిలిపివేస్తే బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీపీపీసీ విద్యుత్‌ కేంద్రాలైన సింహాద్రి, రామగుండం, కొరిసి, తాల్చేరు, వల్లూరుతో పాటు పలు కేంద్రాల నుంచి రోజుకు 51 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందుతోంది. దీని ధర యూనిట్‌కు రూ.4 మాత్రమే ఉంటుంది. ఇంత చౌకగా లభించే విద్యుత్‌ను వదులుకుని మార్కెట్లో యూనిట్‌ రూ.6 కన్నా తక్కువకు ఇవ్వబోమంటున్న ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి విపరీతమైన భారమవుతుందని అధికారులు చెప్పినా ఏమాత్రం విన్పించుకోవడం లేదు.

ప్రభుత్వ పెద్దలకు అనుకూలమైన విద్యుత్‌ ఉత్పత్తిదారులు అధిక రేటుకు విద్యుత్‌ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారు. వీళ్లంతా ముఖ్యమంత్రిని కలిసి మంతనాలు జరిపినట్టు తెలిసింది. ఎన్నికల ఖర్చుల కోసం కొంత ముట్టజెబుతామని చెప్పినట్టు సమాచారం. ఈ కారణంగానే తక్కువగా వచ్చే కేంద్ర విద్యుత్‌కు పరోక్షంగా అడ్డుపడుతున్నారని తెలిసింది. రాష్ట్రంలో  క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా రోజుకు 190 మిలియన్‌ యూనిట్లకు విద్యుత్‌ డిమాండ్‌ చేరింది. ఇందులో 51 మిలియన్‌ యూనిట్ల కేంద్ర విద్యుత్‌ ఆగిపోతే రోజుకు కనీసం నాలుగు గంటల పాటు రాష్ట్రంలో విద్యుత్‌ కోత విధించాల్సి వస్తుంది.  తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు అందలేదని, ఇతర మార్గాల్లో అప్పులు తెచ్చే వరకూ ఎన్టీపీసీకి బకాయిలు చెల్లించలేమని ప్రభుత్వం చెబుతోంది. అయితే  ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తిదారులకు ఎలా చెల్లిస్తారని విద్యుత్‌ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. 

భయపడుతున్న అధికారులు..
చౌకగా లభించే కేంద్ర విద్యుత్‌ను కాదని, ప్రైవేటు విద్యుత్‌ కొనుగోలును ప్రభుత్వం ప్రోత్సహించడాన్ని కొంతమంది విద్యుత్‌ ఉన్నతాధికారులు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల తామెక్కడ ఇబ్బందుల్లో పడతామోననే భయం వాళ్లను వెంటాడుతోంది. ఇంధనశాఖ ముఖ్య అధికారి ఒకరు ప్రైవేటు విద్యుత్‌ కొనుగోళ్లపై లోతుగా అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. కొనుగోలు దిశగా అధికారులు నిర్ణయం తీసుకోలేరని, ప్రభుత్వమే దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన లేఖ రాయడంపై ముఖ్యమంత్రి కార్యాలయం కాస్తా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే విద్యుత్‌ సమన్వయ కమిటీ చేత తీర్మానం చేయించి పంపాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ఎన్టీపీసీకి బకాయిలు చెల్లించపోవడానికి సరైన కారణాలు చూపించాల్సి ఉంటుందని, ప్రభుత్వం చెప్పినట్టు వింటే చిక్కుల్లో పడతామని అధికారులు భయపడిపోతున్నారు. 

మరిన్ని వార్తలు