‘ఎన్టీఆర్ భరోసా’తో పేదల బతుకుల్లో వెలుగు

9 Nov, 2014 02:54 IST|Sakshi
‘ఎన్టీఆర్ భరోసా’తో పేదల బతుకుల్లో వెలుగు

 గోరంట్ల,న్యూస్‌లైన్ : ఎన్టీఆర్ భరోసా పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత అన్నారు. స్థానిక మండల పరిషత్ ఆవరణలో సర్పంచి మంజుల అధ్యక్షతన శనివారం జన్మభూమి గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడుతూ రూ. 2 కోట్లతో రాప్తాడు, పెనుకొండ, హిందూపురం నియోజవర్గాల్లోని అన్ని గ్రామాలకు పైప్‌లైన్ ద్వారా తాగునీరు అందిస్తామని తెలిపారు.

హంద్రీ-నీవా సుజల స్రవంతి ద్వారా జిల్లాలో చెరువులకు నీరందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 49చెరువులకు నీరందించే కార్యక్రమానికి నిధులు విడుదలయ్యాయని తెలిపారు. పెనుకొండ ఎమ్మెల్యే బి.కె. పార్థసార థి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తానని, లేనిపక్షంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు.

గోరంట్ల మండలంలోని 100గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉందని, పీఎబీఆర్‌తో నీటి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌సాబ్ మాట్లాడుతూ 149 చెరువులకు హంద్రీ నీవా ద్వారా నీరు అందిస్తామని చెప్పారు. అంతకు ముందు రూ.50లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పౌరసరఫరాల గోదామును మంత్రి సునీతప్రారంభించారు.

అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీమంతాలకు హాజరయ్యారు. కార్యక్రమంలో జేసీ సత్యనారాయణ, ఆర్టీవో రామ్మూర్తి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ వెంకటేశులు, తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ప్రదీప్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు ఇందిరమ్మ, ఎంపీపీ విద్యాధరణి పాల్గొన్నారు.
 
 దళారుల నియంత్రణకే
 కొనుగోలు కే ంద్రాల ఏర్పాటు

 హిందూపురం : దళారుల నియంత్రణకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. చిలమత్తూరు మార్కెట్ యార్డు సమీపంలో మార్కెఫెడ్ ఆధ్వర్యంలో వెలుగు మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కోనుగోలు కేంద్రాన్ని మంత్రి శనివారం ప్రారంభించారు.

ఎమ్మెల్యే బాలకృష్ణ సూచన మేరకు రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో జిల్లాలో క్వింటా రూ.1310 మద్దతు ధరతో ఆరు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో పెనుకొండ ఎమ్మెల్యే బి.కె.పార్థసారథి, మాజీ ఎమ్మెల్యేలు అబ్దుల్ ఘనీ, రంగనాయకులు, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, వెలుగు శాఖ ఏడీ సుధాకర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు