సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటో పెట్టేందుకు నిరాకరణ!

17 Jul, 2019 10:39 IST|Sakshi

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో పలువురి నిర్వాకం

తన చాంబర్‌లో సీఎం ఫొటో పెట్టాలని వీసీ ఆదేశించినా బేఖాతర్‌

విజయవాడ (హెల్త్‌ యూనివర్సిటీ) : డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో పెట్టేందుకు ప్రయత్నించగా కొంత మంది అడ్డుకుంటున్నారు. తన చాంబర్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటో పెట్టాలని సాక్షాత్తు హెల్త్‌ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ సీవీ రావు ఆదేశించినా సంబంధిత అధికారులు బేఖాతర్‌ చేయడం వర్సిటీలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వర్సిటీలో కీలక పోస్టుల్లో ఉన్న కొంత మంది ఉద్యోగులు సీఎం ఫొటో పెట్టే విషయంలో తాత్సారం చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

గత ప్రభుత్వంలో ఎక్కడా లేని విధంగా వర్సిటీలోనే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం ఏర్పాటు చేసిన అధికారులే.. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటో పెట్టేందుకు మనసొప్పక అడ్డుకుంటున్నారని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ఫొటో పెట్టే విషయమై ప్రభుత్వం నుంచి జీవో విడుదల కాలేదంటూ కొందరు అధికారులు సాకులు చెబుతున్నారు. అయితే యూనివర్సిటీ పక్కనే ఉన్న సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలోని ప్రిన్సిపాల్‌ చాంబర్‌లో, విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటో ఇప్పటికే ఏర్పాటు చేసి చాలా రోజలు కావడం గమనార్హం. వర్సిటీలోని పరిపాలన, ఇంజనీరింగ్‌ తదితర విభాగాల్లో కీలక పోస్టుల్లో పనిచేసే కొంత మంది అధికారులు, ఉద్యోగులు గత ముఖ్యమంత్రి మీద అమితమైన మక్కువతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  
 

మరిన్ని వార్తలు