సిఫార్సులకే ప్రాధాన్యం

11 Jan, 2019 11:51 IST|Sakshi

అర్హులకు దక్కని అందరికీ ఇళ్లు

టీడీపీ నాయకుల చెబితేనే పేర్ల నమోదు

దివ్యాంగులు, వృద్ధులకు

మూడో ఫ్లోర్‌లో కేటాయింపు  

‘పేదలకు ఇళ్లు కేటాయిస్తున్నాం. లోటు బడ్జెట్‌ ఉన్నా ఎంతో చేస్తున్నాం.’ అని వీలు చిక్కినప్పుడల్లా టీడీపీ పెద్దలు చెబుతుంటారు. అదంతా ప్రచార ఆర్భాటంగా తేలిపోయింది. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గృహాలను అర్హులను కాదని టీడీపీ నాయకుల సిఫార్సులున్న వారికే కేటాయిస్తున్నారనే విమర్శలున్నాయి.

నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పరిధిలో అందరికీ ఇళ్లు పథకం కింద మొత్తం 35 వేలు గృహాలు నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించాయి. వెంకటేశ్వరపురంలో 4,800, అల్లీపురంలో 12,856, అక్కచెరువుపాడులో 7,344, కల్లూరుపల్లిలో 10,112 ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా వెంకటేశ్వరపురంలో 90 శాతం నిర్మాణాలు పూర్తికాగా, అల్లీపురంలో 40 శాతం అయింది. కార్పొరేషన్‌ పరిధిలో సుమారు 50 వేలకు మందికిపైగా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎనిమిది నెలల క్రితం వెంకటేశ్వరపురంలోని 4,800 ఇళ్లను, అల్లీపురంలోని కొన్ని ఇళ్లను కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. ఇటీవల అల్లీపురం, అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి ప్రాంతాల్లో 18 వేలు ఇళ్లను లాటరీ పద్ధతి ద్వారా కేటాయించారు.

వారిచ్చిన పత్రం ఉంటేనే..
టీడీపీ నాయకుల సిఫార్సు ఉంటేనే ఇళ్లు మంజూరు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇన్‌చార్జిలు, ఇతర పదవుల్లో నాయకులు సంతకాలు చేసిన పత్రాలను మాత్రమే కార్పొరేషన్‌లో అధికారులు నమోదు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దరఖాస్తు చేసుకున్న సామాన్యులు లాటరీలో వారి పేర్లు రాకపోవడంతో బిక్కమొహం వేస్తున్నారు. నాయకులు అనుచరగణం చెప్పిన వారికి మాత్రం పత్రాలిచ్చి అర్హులకు అన్యాయం చేస్తున్నారు.  

తిరుగుతున్నా..
ఇళ్లు రాకపోవడంతో లబ్ధిదారులు నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటికి రెండుసార్లు పత్రాలను తీసుకురావాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో తప్పని పరిస్థితుల్లో జెరాక్స్‌లు, రవాణా చార్జీలకు ఖర్చు చేసి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా దివ్యాంగులకు, 70 సంవత్సరాలు దాటిన వృద్ధులకు అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఇళ్లు కేటాయిస్తామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. అయితే వారికి రెండు, మూడు ఫ్లోర్లలో కేటాయిస్తుండడంతో ఆవేదన చెందుతున్నారు. కాళ్లు లేని వారికి సైతం మూడో ఫ్లోర్‌లో ఇల్లు కేటాయించడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు