దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్

19 Jan, 2015 01:16 IST|Sakshi
దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్

కేంద్ర మంత్రి దత్తాత్రేయ

సాక్షి, హైదరాబాద్: దివంగత సీఎం నందమూరి తారక రామారావు మహానటుడే కాదు, దేశం గర్వించదగ్గ గొప్ప ప్రజానాయకుడని కేంద్ర  మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ 19వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ఎన్టీఆర్ లలితకళ, ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ పెట్టి, దేశ రాజకీయాలు నడిపారన్నారు.

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్‌లాంటి మహనీయుల వర్ధంతులు కూడా జయంతులేనన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి మాట్లాడుతూ సాహిత్యంలో సి.నా.రె., నటనలో ఎన్టీఆర్‌లు ప్రజా హృదయాల్లో నిలిచిపోయారన్నారు. మహానటి జమున మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకొన్నారు. ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ చైర్‌పర్సన్, ఎన్టీఆర్ సతీమణి ఎన్. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకొన్న మహానటుడు ఎన్టీఆర్ అని, ప్రజల ఆశీర్వాదం తనకు ఇచ్చి వెళ్లారన్నారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ చేతుల మీదుగా ఎన్టీఆర్ లలితకళా పురస్కారాన్ని ప్రఖ్యాత సినీ గేయరచయిత చంద్రబోస్‌కి, ఎన్టీఆర్ ప్రతిభా పురస్కారాన్ని వంశీ రామరాజుకు అందజేశారు. అంతకముందు గాయనీగాయకులు చంద్రతేజ, గీతాంజలి నిర్వహించిన ఎన్టీఆర్ చిత్ర గీతాల సంగీత విభావరి ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ, రచయిత్రి డాక్టర్ కె.వి. కృష్ణకుమారి, వ్యాఖ్యాత లంక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పాటపాడిన దత్తన్న
ఈ సందర్భంగా దత్తాత్రేయ పాట పాడి అలరించారు. తనకు నచ్చిన పాట అంటూ చంద్రబోస్ రాసిన మౌనంగానే ఎదగమని.. పాటను పాడి ఉత్సాహాన్ని నింపారు.

మరిన్ని వార్తలు