ప్రాణం.. గాలిలో దీపం!

28 Feb, 2016 03:04 IST|Sakshi
ప్రాణం.. గాలిలో దీపం!

అత్యవసర సమయాల్లో
మెరుగైన వైద్యం బహు దూరం
శ్రీశైలం నుంచి ఎటు వెళ్లాలన్నా
150 కి.మీ. దూరం         
ప్రయాణించాల్సిందే
పీహెచ్‌సీ స్థాయి
పెంచాలంటున్నా ప్రజలు, భక్తులు

 
శ్రీశైల క్షేత్రం చుట్టూ నల్లమల అభయారణ్యం. నిత్యం ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడే నివాసం ఏర్పరుచుకున్న ప్రజలు, ఉద్యోగులు, సమీపంలోని  గిరిజన తండా వాసులు ఉన్నారు. వీరికి ఆపద సమయంలో శ్రీశైలంలోని పీహెచ్‌సీనే దిక్కు. సున్నిపెంట వైద్యశాల కేసుల రెఫర్‌కే పరిమితం. అత్యవసర వైద్యం అందించాలంటే కర్నూలు, మహబూబ్‌నగర్,  హైదరాబాద్, ఒంగోలు, గుంటూరు వెళ్లాల్సిందే. ఎటు వెళ్లాలన్నా దాదాపు 150 కి.మీ దూరం ప్రయాణించాలి. అంత వరకు మల్లన్నపైన భారం వేయాల్సిందే. - శ్రీశైలం
 
మొన్నటి వరకు శ్రీశైలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తాత్కాలిక శిబిరంలో నిర్వహించారు. ప్రస్తుతం దాదాపు రూ. 40 లక్షలతో పీహెచ్‌సీ భవనాన్ని నిర్మించారు. త్వరలో అందులోకి పీహెచ్‌సీని మార్పు చేస్తున్నారు. అయితే స్థాయి పెంచి సౌకర్యాలు మెరుగుపరిచి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు మెడికల్ ఆఫీసర్లతో పాటు ఆయుష్‌కు చెందిన హోమియోపతి డాక్టర్‌లు విధులు నిర్వహిస్తున్నారు. ఫార్మసీ రూమ్, డ్రగ్స్‌స్టోర్, ల్యాబ్‌టెక్నిషియన్ రూమ్, స్టాఫ్ సిస్టర్స్, నర్స్ రూము, కాన్పులగది, 8 బెడ్లతో కూడిన హాల్, రెఫ్రిరేజటర్ రూమ్, డ్యూటీ డాక్టర్ గదులు ఇందులో ఉన్నాయి. మెడాల్ హెల్త్ కేర్ ప్రైవేటు లిమిటెడ్ వారికి ఎన్‌టీఆర్ వైద్య పరీక్ష పథకం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం చేశారు. అయితే ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేసినా అందులో ఎలాం టి పరికరాలు లేవు. లేబర్ రూమ్‌లో ఇంక్యూబేటర్ పరికరం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఉన్న నూతన పీహెచ్‌సీని శుభ్రంగా ఉంచేందుకుసిబ్బందిని కూడా నియమించలేదు
.

 24 గంటల ఆసుపత్రిగా మార్చితే:

శ్రీశైలం వచ్చే భక్తులు, యాత్రికులు, ఇక్కడే నివాసముండే స్థానికులను దృష్టిలో ఉంచుకుని 24 గంటల వైద్య సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.  కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రభుత్వానికి నివేదిక లు పంపించి  ప్రత్యేక జీఓ ద్వారా  24 గంటల ఆసుపత్రిగా మార్చే అవకాశం ఉంది. స్థాయి పెంచితే ప్రస్తుతం ఉన్న ఇద్దరు డాక్టర్లతో పాటు మరో ఇద్దరు డాక్టర్లను నియమిస్తారు. అలాగే ఇద్దరు స్టాఫ్‌నర్సులతో పాటు ఏఎన్‌ఎంలు, ఫీమెల్ నర్సులను అదనంగా నియమిస్తారు. దీంతో పాటు స్కానర్లు, ఎక్స్‌రే, తదితర అన్ని ఆధునిక పరికరాలు కూడా అందుబాటులోకి వస్తాయి. జిల్లా కలెక్టర్, డీఎంఅండ్ హెచ్‌ఓలు శ్రీశైలం పీహెచ్‌సీ విషయంలో దృష్టి సారించి క్షేత్ర పరిధిలోని ప్రజలు, భక్తుల ప్రాణాల ను రక్షించాల్సిన అవసరం ఉంది.
  
ఐఏఎస్‌ల వెనుకడుగుకు ఇదే కారణం
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రిగా పైడికొండల మాణిక్యాల రావు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి శ్రీశైల దేవస్థానానికి ఐఏఎస్ స్థాయి అధికారులను నియమిస్తామని పలుమార్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇక్కడ ఆధునిక, అత్యవసర వైద్యసౌకర్యాలు అందుబాటులో లేని కారణంగానే శ్రీశైలం ఈఓగా రావడానికి ఐఏఎస్‌లు విముఖత వ్యక్తం చేస్తున్నారని సమాచారం.  హఠాత్తుగా అనారోగ్యపరిస్థితులు ఏర్పడితే నాలుగైదు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని, ఈలోగా ఏదైనా జరిగితే పరిస్థితి ఏమిటనే భయంతోనే వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది.
  
గతంలో వైద్యం అందక..
గతంలో శ్రీశైల దేవస్థానానికి చెందిన పలువురు ఉద్యోగులు, సిబ్బంది, స్థానికులకు సకాలంలో సరైన  వైద్యం అందక మృతి చెందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రోడ్డు ప్రమాదానికి గురైన వారు అత్యవసర చికిత్స కోసం శ్రీశైలం నుంచి సుదూర పట్టణాలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. గుండె పోటుకు గురైన వారికి స్థానికంగా ప్రాథమిక చికిత్స మాత్రమే అందుతోంది. మెరుగైన అందక ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు