ఎన్టీఆర్‌ సినిమాకు బాబు డైరెక్షన్‌!

5 Aug, 2018 03:40 IST|Sakshi

చిత్ర ముఖ్యులతో చర్చలు

చంద్రబాబు రాజకీయాలకు అనుగుణంగానే సినిమా చిత్రీకరణ!

ఎన్టీఆర్‌పై చెప్పులు, సీఎం పదవి లాక్కోవడం, టీడీపీ కబ్జా లాంటివి లేనట్లే..

ఎన్టీఆర్‌ బతికుండగా అన్నింటినీ దూరం చేసిన చంద్రబాబు..

ఇప్పుడు ఆయన జీవిత చరిత్రనూ వక్రీకరిస్తున్నారని అభిమానుల ఆవేదన

వింతల్లోకెల్లా వింత. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పదవీచ్యుతుడిని చేసి, ఆయన మానసిక క్షోభకు, మరణానికి కారకుడైన వ్యక్తే.. ఎన్టీఆర్‌ సినిమా ఎలా తీయాలో, ఆ సినిమాలో ఏం చెప్పాలో నిర్దేశిస్తున్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ నిర్మాత, దర్శకులు బాలకృష్ణ, క్రిష్‌లను చంద్రబాబు శుక్రవారం తన దగ్గరకు పిలిపించుకొని మూడు గంటలపాటు ఆ సినిమాపై కర్తవ్య ప్రబోధం చేయడం తెలుగు ప్రజలను షాక్‌కు గురిచేసింది.

సాక్షి, అమరావతి: ప్రముఖ నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర సినిమా సీఎం చంద్రబాబు సూచనల ప్రకారం తెరకెక్కుతోందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆ సినిమాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండగా చిత్ర ముఖ్యులు చంద్రబాబుతో సుదీర్ఘంగా సమావేశం కావడం వాటికి బలాన్ని చేకూరుస్తోంది.ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్‌ కుమారుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న దగ్గుబాటి రాణాలు శుక్రవారం మూడు గంటలపాటు చంద్రబాబుతో ఈ సినిమా గురించి చర్చించారు.

ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ అనగానే ఆయన జీవితంలో అత్యంత విషాదకర పరిణామాలేవీ ఉండవని, అన్ని ఘటనలను చంద్రబాబు రాజకీయాలకు అనుగుణంగా చిత్రీకరిస్తారని అటు సినిమా, ఇటు రాజకీయ వర్గాలో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలపై ఎన్టీఆర్‌ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి ఇప్పటికే దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్‌ మానసిక క్షోభ సినిమాలో లేనట్లే..
తెలుగు సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొంది, ఆ తర్వాత రాజకీయాల్లోకొచ్చి సంచలనాలు సృష్టించిన ఎన్టీఆర్‌ చివరి దశ అత్యంత దారుణంగా ముగిసింది. ఒక పథకం ప్రకారం ఎన్టీఆర్‌ అల్లుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపి దాన్ని ఆక్రమించారనే విషయం జగమెరిగిన సత్యం. పిల్లనిచ్చిన పాపానికి తనను మోసం చేశాడని, చంద్రబాబు మరో ఔరంగజేబని బ్రతికున్న రోజుల్లో ఎన్టీఆర్‌ వాపోయారు. ముఖ్యమంత్రి పదవిని లాక్కోవడమేగాక, చంద్రబాబు ఆయనపై చెప్పులు వేయించి, దుర్భాషలాడించి తీవ్ర అవమానాల పాలు చేశారు.

ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని కబ్జా చేయడమేగాక ఒక వ్యూహం ప్రకారం ఎన్టీఆర్‌ కుటుంబాన్ని ఆయనకు దూరం చేసి ఒంటరి చేశారు. ఈ మానసిక వ్యధతోనే ఆయన 1996 జనవరి 18న మృతి చెందారు. బ్రతికున్నంత కాలం అన్నివిధాలుగా అవమానించి వేధించిన చంద్రబాబు మృతి చెందిన తర్వాత ఆయన కీర్తిని కూడా కబ్జా చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగుడుతున్నా ఆయన మరణానికి చంద్రబాబే కారణమని ఆరోపణలు తరచుగా అభిమానుల నుంచి వింటూనే ఉంటాం.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను సినిమాగా తీస్తుండడం, ఆయన పాత్రను చంద్రబాబుకు పూర్తి అనుకూలంగా ఉండే ఆయన కుమారుడు బాలకృష్ణ నిర్మిస్తూ, స్వయంగా తండ్రి పాత్ర వేస్తుండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సూచనలు, సలహాల ప్రకారం పూర్తిగా ఆయనే అనుకూలంగా ఉండేలా సినిమా తీయనున్నారని ఎన్టీఆర్‌ అభిమానులు పేర్కొంటున్నారు. ఎన్టీఆర్‌ చివరి దశలో చంద్రబాబు వల్ల జరిగిన విషాద ఘటనలేవీ ఈ సినిమాలో ఉండవని వారు స్పష్టం చేస్తున్నారు.

గాంధీ సినిమాకు గాడ్సే సూచనలా?
మొదట ఈ సినిమాను తేజ దర్శకత్వంలో నిర్మించాలనుకున్నారు. కొంత పని కూడా జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. బాలకృష్ణ చెప్పిన ప్రకారం సినిమాను తీసేందుకు తేజ ఒప్పుకోలేదని సమాచారం. తనతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తీసిన క్రిష్‌ అయితే తాము చెప్పినట్లు సినిమా తీస్తారని, ఇబ్బంది ఉండదని బాలకృష్ణ భావించడంతోనే దర్శకుడి మార్పు జరిగిందనే వాదన ఉంది.

ఈ మార్పు జరిగినప్పుడే ఎన్టీఆర్‌ సినిమా వాస్తవానికి దగ్గరగా ఉండే అవకాశం లేదనే విశ్లేషణలు వచ్చాయి. తాజాగా చంద్రబాబు వద్దకే నేరుగా చిత్ర దర్శకుడు వచ్చి కొన్ని గంటలపాటు సూచనలు తీసుకోవడంతో ఎన్టీఆర్‌ జీవితంలోని విషాద పరిణామాలను వక్రీకరించడం ఖాయమని స్పష్టమవుతోంది. ఈ చర్చలపై సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గాంధీ సినిమాకు ఆయన్ను చంపిన గాడ్సే సూచనలు తీసుకున్నట్లు ఎన్టీఆర్‌ సినిమాకు ఆయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు సలహాలు తీసుకుంటున్నారనే సెటైర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఎన్టీఆర్‌ అంతిమ దశలో చోటుచేసుకున్న దుర్భర పరిణామాలను చంద్రబాబుకు అనుకూలంగా, రాజకీయంగా ఆయనకు ఉపయోగపడేలా చిత్రీకరిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా చంద్రబాబు కోణంలోనే ఉంటుందని, బ్రతికుండగా ఆయన్ను అన్నింటికీ దూరం చేసి చివరికి ఆయన జీవిత చరిత్రను కూడా చంద్రబాబు వక్రీకరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు