రేపటి నుంచి నూకాంబిక జాతర

5 Apr, 2016 02:00 IST|Sakshi

నెలరోజులపాటు ఉత్సవాలు
ఏర్పాట్లు పూర్తిచేసిన  దేవాదాయశాఖ

 

అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి మే 6 వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆలయ సహాయ కమిషనర్ సుజాత తెలిపారు. ఆరో తేదీ రాత్రి జాతర, ఏడో తేదీన కొత్త అమావాస్య పండగ, 8న ఉగాది,  మే 6న నెల పండగ నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ పరిసరాల్లో చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యంతోపాటు పిల్లలకు పాలు, పెద్దలకు మజ్జిగను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని ప్రభుత్వశాఖ అధికారులతో ఇప్పటికే  సమన్వయ సమావేశాలు నిర్వహించారు.

 
అమ్మవారి చరిత్ర...

సుమారు 550 ఏళ్లకిందట నూకాంబిక అమ్మవారు కాకతాంబగా వెలిశారు. ఆర్కాట్ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పని చేసి కాకర్లపూడి అప్పలరాజు కళింగాంధ్ర ప్రభువైన బహుభలేంద్రుడిని ఓడించి అనకాపల్లి కేంద్రంగా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే గవరపాలెం ప్రాంతంలో శత్రుదుర్బేధ్యమైన కోటను నిర్మించి వారి ఇలవేల్పు కాకతాంబ గుడిని దక్షిణ ప్రాంతంలో నిర్మించారు. తర్వాత కాలంలో విజయనగరం రాజులు కాకతాంబ పేరును నూకాంబిక అమ్మవారిగా మార్చి కొలిచేవారు. తర్వాత కాలంలో గోడి జగన్నాథరాజును అనకాపల్లి కోటకు సామంతరాజుగా విజయనగరం రాజు నియమించారు. అనేక సంవత్సరాలు బ్రిటీష్‌వారికి పన్నులు చెల్లించకపోవడంతో కోటను వేలం వేశారు. వైరిచర్ల ఆనందగజపతిరాజు వేలంపాటలో కోటను సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి వైరచర్ల వంశీయులే దేవస్థానం ధర్మకర్తలుగా వ్యవహరించేవారు.

 
1935లో దేవాదాయ శాఖ పరిధిలోకి...

నూకాంబిక అమ్మవారి దేవాలయంలో 1935లో దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోకి వెళ్లింది. దినదిన ప్రవర్థమానమై 40 కాటేజీలు, క్యూకాంప్లెక్స్‌లు, కల్యాణ మండపాలను నిర్మించారు. పిలిచిన వెంటనే పలికే ఇలవేల్పుగా, కల్పవల్లిగా, తల్లిగా భక్తులు కొలిచే అనకాపల్లి నూకాంబిక అమ్మవారు ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రసిద్ధికెక్కారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ బహుళ అమావాస్య అనగా ఉగాది ముందురోజు నుంచి నెలరోజులపాటు కొత్త అమావాస్య జాతర మాసోత్సవాలను నిర్వహిస్తారు.


నిత్య అన్నదాన పథకం...
నూకాంబిక అమ్మవారి ఆలయంలో నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. ప్రతి రోజు ఇక్కడికి విచ్చేసే కొందరు భక్తులకు అన్నదానం చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు