ఇచ్చట ‘మీసేవ’ తిరస్కరించబడును!

21 Apr, 2019 03:39 IST|Sakshi

తిర‘కాసు’ సేవగా మారిన మీసేవ

ఐదేళ్లుగా రాష్ట్రంలో 71.35 లక్షల అర్జీల తిరస్కరణ

పెండింగ్‌లో మరో 8 లక్షల వినతులు

ప్రజల ముక్కు పిండి వసూలు చేసింది రూ.213 కోట్లకుపైనే

తిరస్కృతికి కనీసం కారణం కూడా చెప్పరు

సిబ్బందిని నేరుగా కలసి సంతృప్తిపరిస్తేనే అర్జీకి మోక్షం

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారుల పడిగాపులు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడుకు చెందిన రైతు శివప్రసాద్‌రెడ్డికి వారసత్వంగా వచ్చిన భూమి ఉంది. ఒక సర్వే నంబరు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాకపోవడంతో మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. ముడుపులు ఇవ్వకపోవడంతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు.

వైఎస్సార్‌ జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన శంకర్‌రెడ్డి (బాధితుడి విజ్ఞపి మేరకు పేరు మార్చాం) మ్యుటేషన్‌ కోసం రెవెన్యూ రికార్డుల్లో తన పేరు నమోదు చేయాలంటూ నిర్దిష్ట రుసుము చెల్లించి అన్ని ఆధారాల జిరాక్స్‌ కాపీలతో ‘మీసేవ’ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి కారణాలు చూపకుండానే ఆయన దరఖాస్తును తిరస్కరించారు. సంబంధిత అధికారిని కలవగా ముడుపుల కింద కొంత సొమ్ము తీసుకుని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంత చేసినా ఇప్పటికీ ఆయన పేరుతో మ్యుటేషన్‌ కాలేదు.

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లుగా తిరస్కరించిన ‘మీసేవ’ దరఖాస్తుల సంఖ్య 71 లక్షలకుపైమాటే. ఒక్కో దరఖాస్తుకు ప్రజలు సగటున రూ.300 చొప్పున చెల్లించినట్లు లెక్క వేసినా 71 లక్షల అర్జీలను తిరస్కరించడం ద్వారా సర్కారు వసూలు చేసిన సొమ్ము రూ.213 కోట్లకు పైమాటే! ఇక బాధితులు నష్టపోయింది దీనికంటే ఎక్కువే ఉంటుంది. పౌరులకు పనులు జరగని మీసేవ అర్జీలతో ఎవరికి ఉపయోగం? అనే ప్రశ్నలు వస్తున్నాయి. మీసేవలో దరఖాస్తు చేసినా మళ్లీ సంబంధిత కార్యాలయాలకు వెళ్లి ముడుపులు చెల్లిస్తే తప్ప పరిష్కారం కావడం లేదు. రెవెన్యూ, పురపాలక శాఖల్లో ఇలాంటి పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. దీంతో ‘ఎందుకొచ్చిన మీసేవ..?’ అంటూ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం
పారదర్శకతకు మారుపేరంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ‘మీసేవ’ తిరస్కరణ సేవగా మారింది. భూముల మ్యుటేషన్, కొలతలు, అదనపు సర్వే నంబరు చేర్పు, వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం, భవన నిర్మాణ ప్లాన్‌ అప్రూవల్‌ తదితరాల కోసం ‘మీసేవ’ ద్వారా అందే దరఖాస్తులను అధికారులు పెద్ద ఎత్తున తిరస్కరిస్తూ చెత్తబుట్టలో పడేస్తున్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మీసేవ తిరస్కరణ అర్జీలు 71 లక్షలు దాటిపోవడం సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. 

గడువుదాకా పట్టించుకోని సిబ్బంది..
ఏ పని కావాలన్నా లంచాలు చెల్లించాల్సిన పనిలేదని, నిర్దిష్ట రుసుము కట్టి మీసేవ ద్వారా ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకుంటే చాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్త డొల్ల అనేందుకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్న పౌరులే నిదర్శనం. ఏ శాఖల కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు తీరలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీసేవలో దరఖాస్తు ఇచ్చినా పట్టించుకునే దిక్కులేక గ్రీవెన్స్‌సెల్‌లో అర్జీలు ఇస్తున్నారు. మీసేవ ద్వారా అందే అర్జీలను చాలామంది సిబ్బంది నిర్దిష్ట గడువు వరకు పట్టించుకోకుండా తీరా రెండు మూడు రోజుల ముందు చిన్న చిన్న కారణాలతో తిరస్కరిస్తున్నారు. కొంతమంది సిబ్బంది కనీసం కారణం కూడా చూపకుండానే పక్కన పడేస్తున్నారు. 

పక్కవారికి పంపితే పరిష్కారమైనట్లా?
కొందరు సిబ్బంది తమ వద్దకు వచ్చే అర్జీలను ఇతర ఉద్యోగుల వద్దకు పంపుతూ పరిష్కారమైనట్లు జాబితాలో చేర్చేస్తున్నారు. దీనివల్ల పరిష్కారమైన అర్జీలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ తంతును చూసి ఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వినతులను తిరస్కరించడం దారుణమైతే, ఫైలును పక్క ఉద్యోగికి పంపి పరిష్కారమైనట్లు నమోదు చేయడం మరీ ఘోరమని పేర్కొంటున్నారు. ‘ఈ పరిణామాలు ఏమాత్రం సరికాదు. సరైన కారణాలు చూపకుండా కొందరు, అసలు కారణం పేర్కొనకుండానే మరికొందరు వినతులను తిరస్కరిస్తున్నట్లు నా దృష్టికి కూడా వచ్చింది. నిర్దిష్ట సమయంలో దరఖాస్తు పరిష్కరించకుంటే సంబంధిత ఉద్యోగి పేరు రికార్డుల్లో నమోదవుతుంది. దీని నుంచి తప్పించుకునేందుకు దురుద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారని గుర్తించాం. ఇలా జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని స్పెషల్‌ ఛీప్‌ సెక్రటరీ స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు.

చేతి చమురు వదులుతోంది
‘మీసేవ’ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు రుసుములు, సర్వీసు చార్జీల రూపంలో రూ.వందల్లో చెల్లిస్తున్నారు.  అయితే దరఖాస్తుతో పని అయిపోతుం దనుకుంటే పొరపాటే. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తుకు జత చేసిన పత్రాలు స్పష్టంగా లేవంటూ, జిరాక్స్‌ కాపీలు ఇవ్వాలని ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాధానం వస్తోంది. దీనికి మరికొంత సొమ్ము చెల్లించాలి. ఇలా మీసేవలో దరఖాస్తు చేసుకుంటే ఒక్కో అర్జీకి సుమారు రూ. 400 దాకా చేతి చమురు వదులుతోంది. 

ఇవీ ‘మీసేవా’ గణాంకాలు...
- 2014 జూన్‌ నుంచి ఇప్పటివరకు రెవెన్యూ వెబ్‌సైట్‌ వెబ్‌ల్యాండ్‌లో అదనపు సర్వే నంబరు చేర్పు కోసం 2,41,447 వినతులు రాగా 1,57,365 అర్జీలను తిరస్కరించారు. 82,557 దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు. 
వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం 69,274 మంది దరఖాస్తు చేసుకోగా 50,913 అర్జీలను ఆమోదించారు. 17,576 వినతులను తిరస్కరించి చెత్తబుట్టలో పడేశారు. 
500 చదరపు అడుగులలోపు ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో కట్టడాల క్రమబద్ధీకరణ కోసం 32,056 అర్జీలు రాగా 3,562 వినతులను మాత్రమే ఆమోదించారు. 20361 దరఖాస్తులను  తిరస్కరించారు. 
ఆక్రమిత ప్రభుత్వ భూమిలో కట్టడాల క్రమబద్ధీకరణ కోసం 73,783 వినతులు రాగా 3401 అర్జీలు మాత్రమే ఆమోదం పొందాయి. 70,382 దరఖాస్తులను తిరస్కరించారు. 
ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ కోసం 8,60,440 దరఖాస్తులు రాగా 6,20,070 అర్జీలను ఆమోదించారు. 2,25,711 వినతులు తిరస్కరించారు. 
కంప్యూటరైజ్డ్‌ అడంగల్‌లో కరెక్షన్‌ కోసం 40,74,721 వినతులు రాగా 26,97,255 మాత్రమే ఆమోదం పొందాయి. మిగిలిన 13,37,732 అర్జీలు చెత్తబుట్టపాలయ్యాయి. 

మరిన్ని వార్తలు