గుడ్డు గగనమే!

13 Feb, 2015 00:46 IST|Sakshi
గుడ్డు గగనమే!

అంగన్వాడీ కేంద్రాలకు నిలిచిన సరఫరా
బాలలకు అందని పౌష్టికాహారం

 
కొయ్యూరు:  చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా గుడ్డు సరఫరా చేస్తోంది. మన్యంలో బాలింతలు, గర్భిణులకు కూడా ఇందిరమ్మ అమృతహస్తం పథకంలో గుడ్లు అందజేస్తోంది.  అయితే ఎం.భీమవరం పరిధిలోని ఎనిమిది అంగన్వాడీల్లో పరిస్థితి అందుకు భిన్నం. మండపల్లిలో అంగన్వాడీ కేంద్రానికి గూడెంకొత్తవీధి మండలంలోని పందిరాయి కొత్తగూడెం నుంచి వెళ్లాలి. ఈ కేంద్రానికి సరఫరా కావాల్సిన గుడ్లు తూర్పు గోదావరి జిల్లా వై.రామవరంలో దించుతారు. అక్కడనుంచి కొండలు, గుట్టలు మీదుగా తీసుకురావడం వల్ల పగిలిపోతున్నాయి.

సుమారు 40 కిలోమీటర్ల మేర కాలినడకన తీసుకువెళ్లడంతో చివరి 10 శాతం గుడ్లు కూడా మిగలడం లేదు. వై.రామవరంకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదలకం కొత్తూరు, 30 కిలోమీటర్ల దూరంలోని పుట్టకోటది అదే పరిస్థితి. పోతవరం, ఎం.భీమవరం,చీడికోట, వాలుగూడెం అంగన్వాడీ కేంద్రాలకు వై.రామవరం నుంచి తీసుకువెళ్లాలి. ఈ గ్రామం 17 కిలోమీటర్ల దూరంలోని కొండలపై ఉంది. అక్కడికి గుడ్లు తరలించేసరికి పగిలిపోతున్నాయి.

 ఇలాచేస్తే మేలు: తూర్పు గోదావరి జిల్లాలో మారేడుమిల్లి మండలం నుంచి పోతవరం గ్రామానికి రహదారి మెరుగ్గానే ఉంటుంది. ఇక్కడ అధికారులు అక్కడ అధికారులతో మాట్లాడి అటు వైపు నుంచి గుడ్లు సరఫరా చేయకగలిగితే అందరికీ గుడ్లు అందే అవకాశం ఉంటుంది.
 
 పిల్లలకు పెట్టలేకపోతున్నాం
 వై.రామవరం నుంచి గుడ్లు తీసుకువస్తుంటే  గుడ్లన్ని పగలిపోతున్నాయి. వంద గుడ్లు తెస్తే వాటిలో 90వరకు పగిలిపోతున్నాయి. దీంతో పిల్లలకు గుడ్లు పెట్టలేకపోతున్నాం.                                 - గొలిసింగి దేవామణి,
                            ఎం.భీమవరం అంగన్వాడీ వర్కర్
 
 ప్రత్యామ్నాయం ఆలోచిస్తాం
 తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి నుంచి గుడ్లు తరలించే విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం.పోతవరం వరకు గుడ్లు పంపించే అంశాన్ని పరిశీలిస్తాం.                          - ప్రసన్న వెంకటేష్,
                                         పాడేరు సబ్ కలెక్టర్
 

మరిన్ని వార్తలు