చికెన్‌ బిర్యానీ... డ్రై ప్రూట్స్

30 Apr, 2020 07:47 IST|Sakshi
హంపాపురం ఎస్‌వీఐటీ క్వారంటైన్‌లోని వారికి అందించేందుకు సిద్ధం చేసిన డ్రైప్రూట్స్, తాజా పండ్లు

ఆరోగ్యమే మహాభాగ్యం  

క్వారంటైన్‌లో ఉన్న వారికి మంచి పౌష్టికాహారం  

వారంలో మూడ్రోజులు చికెన్‌తో భోజనం

సాయంత్రం వేళ  డ్రైప్రూట్స్, పండ్లు  

అనంతపురం హాస్పిటల్‌: కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అలాగే వైరస్‌ బారిన వారు త్వరగా కోలుకునేందుకు కిమ్స్‌–సవీరా, బత్తలపల్లి ఆర్డీటీ హాస్పిటల్, సర్వజనాస్పత్రి తదితర ఆస్పత్రుల్లో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తోంది. దీంతో పాటు క్వారంటైన్‌లో ఉన్న వారికి  పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందువల్లే వైరస్‌ బారిన పడిన వారు త్వరగా కోలుకుని డిశ్చార్జ్‌ అవుతున్నారు. జిల్లాలో బుధవారం వరకూ 58 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అందులో 20 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లడం గమనార్హం.

ఆదివారం బిర్యానీ
జిల్లాలో మొత్తం 36 క్వారంటైన్‌లు ఏర్పాటు చేశారు. అందులో 7,485 పడకలు సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం అందులో 652 మంది ఉన్నారు. వీరికిచ్చే డైట్‌లో పౌష్టికాహారాన్ని అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం బిర్యానీ, మంగళవారం రైస్‌తో పాటు చికెన్‌ కర్రీ, శుక్రవారం రైస్‌తో పాటు చికెట్‌ కర్రీ ఇస్తున్నారు. దీంతో పాటు రెగ్యులర్‌గా మూడు పూటల భోజనంతో పాటు పాలు, గుడ్డు, చిక్కీ, స్నాక్స్, రాత్రి వేళల్లో ప్రూట్స్‌ ఇస్తున్నారు. అలాగే ఓ మెడికల్‌ ఆఫీసర్, తదితర సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్నారు. కరోనా లక్షణాలు కన్పిస్తే వారిని నిర్ధారణ పరీక్షలు చేసి, మెరుగైన వైద్యం కోసం కోవిడ్‌ ఆస్పత్రులకు తరలిస్తున్నారు.  

ఖర్చుకు వెనుకాడొద్దన్నారు
క్వారన్‌టైన్‌లో ఉన్న వారికి పౌష్టికాహారం అందించాలని, ఖర్చుకు వెనుకాడవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సీఎం సూచనలతో జిల్లాలోని వివిధ క్వారన్‌టైన్‌లలో ఉన్న వారికి పౌష్టికారం అందిస్తున్నాం. తాజా పండ్లు, డ్రైప్రూట్స్‌ అందించేలా చర్యలు తీసుకున్నాం.     – గంధం చంద్రుడు, కలెక్టర్‌

అలరిస్తున్న వినోద కార్యక్రమాలు
గుత్తి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలను అధికారులు క్వారం టైన్‌ సెంటర్లకు పంపారు. ఎస్కేడీ, కేంద్రీయ విద్యాలయా ( క్వారంటైన్‌ సెంటర్లు)ల్లో  సుమారు 20 రోజులుగా వలస కూలీలు ఒంటరి జీవితం గడుపుతున్నారు. వారికి మానసిక ఉల్లాసం కలిగించడంతో పాటు ఆనందింపజేయాలన్న ఉద్దేశంతో సీఐ రాజశేఖర్‌రెడ్డి చొరవతో బుధవారం కళాకారుల చేత వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో వలస కూలీలు ఎంతో హుషారుగా కార్యక్రమాలను వీక్షించారు.  

36 జిల్లాలోని క్వారంటైన్‌లు
7,485 పడకల సంఖ్య
652  క్వారంటైన్‌లో ఉన్న వారు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు