పౌష్టికాహారం అందేనా?

1 Sep, 2018 13:36 IST|Sakshi
న్యూట్రిషియన్‌ గార్డెన్‌లో కూరగాయలను కోస్తున్న అంగన్‌వాడీలు (ఫైల్‌)

జిల్లాలో కనిపించని న్యూట్రిషియన్‌ గార్డెన్లు

అంగన్‌వాడీ కేంద్రాలకువేధిస్తున్న స్థలాల కొరత

ఇప్పటికి 465 గ్రామ పంచాయతీల్లో స్థలాల గుర్తింపు

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు తాజా కూరగాయలతో వండిన పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో  ప్రభుత్వం  న్యూట్రిగార్డెన్లను ఏర్పాటు చేస్తోంది. స్థానికంగా ఆయా కేంద్రాలలో కూరగాయలను పండించుకోవడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు  కనీసం 20 సెంట్ల స్థలాన్ని కేటాయించాలి. కాగా ఇప్పటివరకు జిల్లాలో 465 గ్రామ పంచాయతీల్లో స్థలాన్ని గుర్తించారు. కాగా మిగతా కేంద్రాల్లో స్థలాల గుర్తింపు పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

కడప కోటిరెడ్డి సర్కిల్‌: జిల్లాలో ప్రతి పంచాయతీలో న్యూట్రిషియన్‌ గార్డెన్లను ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ బాధ్యతను పంచాయతీరాజ్, ఉపాధి హామీ పథక, స్త్రీ శిశు సంక్షేమశాఖకు ప్రభుత్వం అప్పగించింది. వీటి ఏర్పాటుకు ఈ శాఖలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని న్యూట్రిషియన్‌ గార్డెన్ల కోసం పంచాయతీల పరిధిలో 20 సెంట్ల స్థలాన్ని కేటాయించి ఉపాధి హామీ అధికారులకు అప్పగించాలని తహసీల్దార్లకు స్పష్టం చేసింది. ఈ స్థలాల గుర్తింపులో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టి ఇప్పటివరకు 465 చోట్ల గుర్తించారు. జిల్లాలో మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు 3,268, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 353 కలిపి మొత్తం 3,621 ఉన్నాయి. ఇందులో ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు 1,05,711 మంది, మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలలోపు 96,570 మంది పిల్లలున్నారు. గర్భిణులు 2,321, బాలింతలు 22,174 మంది  ఉన్నారు. వీరందరికీ పౌష్టికాహారం అందించడానికి ప్రతినెల 35,48,222 కోడిగుడ్లు అందిస్తున్నారు.

అందుబాటులో లేని ప్రభుత్వ స్థలాలు..
అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమశాఖకు అప్పగించారు. మెనూ ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించాలి. కూరగాయల ఖర్చులు, సరుకులకు ప్రభుత్వమే నిధులను విడుదల చేస్తోంది. అయితే ఈ ఖర్చును తగ్గించుకునేందుకు ఆయా గ్రామాలలో 10 నుంచి 20 సెంట్ల స్థలాన్ని కేటాయించి, అక్కడ కూరగాయలు పండించాలి. అయితే ఒక్క గ్రామంలో కూడా దీనికి అవసరమైన ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేవు. దాతల నుంచి స్థలాన్ని సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

తలకు మించిన భారం..
న్యూట్రిషియన్‌ గార్డెన్ల ఏర్పాటు అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఓ పక్క ఉన్నతాధికారుల ఒత్తిడి, మరోపక్క క్షేత్ర స్థాయిలో స్థలాల కొరత అధికారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే మంజూరైన అంగన్‌వాడీ కేంద్రాలకు కొన్ని గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం కూడా లభించక వాటి నిర్మాణ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

స్థల పరిశీలన చేపట్టాం..
ప్రభుత్వ నిబధనల ప్రకారం పది సెంట్ల స్థలం లభిస్తే అక్కడే పండిన కూరగాయలతో మంచి పౌష్టికాహా రాన్ని అంగన్‌వాడీ కేం ద్రాలలో అందించాలనే దృక్పథంతో ప్రభుత్వం న్యూట్రిషియన్‌ గార్డెన్లను ప్రవేశ పెడుతోంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో స్థలాల పరిశీలన చేపట్టాం. ఇప్పటికి 465 గ్రామ పంచాయతీలలో స్థలాలను గుర్తించాం. త్వరలో న్యూట్రిషియన్‌ గార్డెన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.    – పద్మజ, ఐసీడీఎస్‌ పీడీ, కడప

మరిన్ని వార్తలు