తిండి కలిగితే కండ కలదోయ్‌!

18 Sep, 2019 10:00 IST|Sakshi
శ్రీకాకుళంలో 2కె రన్‌లో విద్యార్థులు

ఆరోగ్య భారత్‌ సాధనే లక్ష్యం

ఆర్డీవో ఎంవీ రమణ

పోషణ్‌ అభియాన్‌పై 2కే రన్‌ నిర్వహణ

తిండి కలిగితే కండ కలదోయ్‌.. కండ కలవాడేను మనిషోయ్‌.. అన్నారు గురజాడ వారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోషణ్‌ అభియాన్‌ రన్‌లోనూ ఇదే నినాదాన్ని వినిపించారు.
సాక్షి, శ్రీకాకుళం అర్బన్‌: 
పౌష్టికాహారంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలపై ఉందని శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఎంవీ రమణ అన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల సిల్వర్‌జూబ్లీ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోవడం వలన ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. భారత దేశం శక్తివంతమైన దేశంగా ఎదగాలంటే ఆరోగ్యంతోనే సాధ్యమని ప్రధాని నరేంద్రమోదీ ఆరోగ్య భారత్‌కు పిలుపునిచ్చారన్నారు.

అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాల సరసన భారత్‌ ఉండాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పోషణ అభియాన్‌ కార్యక్రమానికి నాంది పలకడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పౌష్టికాహరం, రక్తహీనత నివారణ, డయేరియా నివారణ, చేతుల పరిశుభ్రతపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ సమీపంలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి తమ ఆరోగ్యాన్ని పరిక్షించుకోవాలన్నారు. రక్తహీనతను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే కరపత్రాలు ముద్రించిందని వాటిని గ్రామస్థాయిలో పంపిణీ చేయాలని సూచించారు.

రక్తహీనతే ప్రధాన సమస్య
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎ.కల్యాణచక్రవర్తి మాట్లాడుతూ జిల్లాలోని మహిళలు, విద్యార్థులలో రక్తహీనత ఎక్కువగా ఉందన్నారు. సుమారు లక్ష మంది మహిళలకు రక్త పరీక్షలు నిర్వహించగా వారిలో దాదాపు 75వేల మందికి పైగా రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. దీనిని అధిగమించేందుకు ‘నాంది’ అనే కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్ల చెప్పారు. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత నుండి బయటపడి పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. అనంతరం జిల్లా మహిళాభివృద్ధి సంక్షేమశాఖ పథక సంచాకులు జి.జయదేవి మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఎనీమియా వంటి వ్యాధుల నుంచి బయటపడవచ్చన్నారు. కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌ కూడలి వద్ద నుంచి నిర్వహించిన 2కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పౌష్టికాహారం–ఇంటింటా వ్యవహారంపై ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా పర్యటక అధికారి ఎన్‌.నారాయణరావు స్వచ్ఛతే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వావిలపల్లి జగన్నాథంనాయుడు రచించిన ప్లాస్టిక్‌ నిర్మూలను ప్రతిజ్ఞ చేయించారు.

2కే రన్‌ విజేతలకు బహుమతులు
పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడాసాధికార సంస్థ ఏర్పాటు చేసిన 2కే రన్‌ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. బాలికల విభాగంలో ఎస్‌.మౌనిక(పీఎస్‌ఎన్‌ఎంసీహెచ్‌ స్కూల్‌) ప్రథమ స్థానం, ఎం.హైమావతి(ఏవీఎన్‌ఎంసీహెచ్‌ స్కూల్‌) ద్వితీయ స్థానం, కె.సరస్వతి (ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాల) తృతీయ స్థానాలలో విజేతలుగా నిలిచారు. అలాగే బాలుర విభాగంలో బి.లక్ష్మణ్‌ (పీఎస్‌ఎన్‌ఎంసీహెచ్‌ స్కూల్‌) ప్రథమ స్థానం, ఎం.చంటి (టీపీఎంసీహెచ్‌ స్కూల్‌) ద్వితీయ స్థానం, మహ్మద్‌ రజిల్‌ (జెడ్పీహెచ్‌ఎస్, కేశవరావుపేట) తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచారు. వీరికి ఆర్‌డీవో ఎంవీ రమణ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్‌ టి.శ్రీనివాసరావు, ఇన్‌ఛార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బగాది జగన్నాథరావు, మెప్మా పథక సంచాలకుడు కిరణ్‌కుమార్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసకుమార్, తహసీల్దార్‌ ఐటీ కుమార్, సెట్‌శ్రీ సీఈవో శ్రీనివాస్, ఉప విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, పీఈటీ అసోసియేషన్‌ కార్యదర్శి ఎం.సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు