బరువు తక్కువ బాల్యం!

20 May, 2018 04:08 IST|Sakshi

రాష్ట్రంలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి ఎదుగుదల లోపం

కర్నూలు జిల్లాలో పరిస్థితి అధ్వానం 

30 ఎస్టీ మండలాల్లో పరిస్ధితి ఆందోళనకరం

చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీలో నిర్లక్ష్యం

సాక్షి, అమరావతి: ఆటపాటలతో ఆనందంగా బాల్యాన్ని గడపాల్సిన చిన్నారులు బరువు తక్కువ, పౌష్టికాహార లోపాలతో భారంగా గడుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న లక్షల మంది చిన్నారులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద సర్కారు కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నా చిన్నారులను పౌష్టికాహార లోపం పట్టిపీడించడం గమనార్హం.
 
ఊబకాయం, ఎదుగుదల లోపాలు
రాష్ట్రంలోని పిల్లల్లో ఎదుగుదల సరిగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు 23.82 లక్షల మంది ఉండగా ఏకంగా 36.4 శాతం అంటే 8.69 లక్షల మందిలో ఎదుగుదల సరిగా లేదని తేలింది. మరోవైపు ఊబకాయం ముప్పు కూడా విస్తరిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో 12.7 శాతం మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఊబకాయంతో బాధపడుతుండగా ఈ ఏడాది జనవరి నాటికి ఇది 14.6 శాతానికి పెరిగింది. 3.45 లక్షల మంది చిన్నారులు ఊబకాయంతో సతమతమవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదిక స్పష్టం చేసింది. 

కర్నూలులో పౌష్టికాహార లేమి
కర్నూలు జిల్లా పిల్లల్లో పౌష్టికాహార లోపాలు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. కర్నూలు జిల్లాల్లో ఐదేళ్లలోపు పిల్లలు 2.75 లక్షల మంది ఉండగా 1.24 లక్షల మందిలో ఎదుగుదల సరిగా లేదు. ఇదే జిల్లాలో 56,600 మంది తక్కువ బరువుతో సతమతం అవుతున్నారు. 26,500 మంది  ఊబకాయంతో బాధపడుతున్నారు. 21,800 మందిలో ఎత్తుకు తగినట్లుగా బరువు లేదు.
 
ఎస్టీల పరిస్థితి దయనీయం
ఇక ఇతర మండలాలకన్నా ఎస్టీలు అధికంగా నివసించే 30 మండలాల్లో చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రభుత్వ నివేదికలో స్పష్టమైంది. 30 ఎస్టీ మండలాల్లో బరువు తక్కువగల పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో సగటున బరువు తక్కువ పిల్లలు రెండు శాతం మంది ఉంటే 30 ఎస్టీ మండలాల్లో ఏకంగా 4.2 శాతం మంది బరువు తక్కువగల పిల్లలున్నారు. జిల్లాలవారీగా చూస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 14 శాతం మంది తక్కువ బరువున్న పిల్లలున్నారు. ఊబకాయం కలిగిన పిల్లల సంఖ్య శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మినహా అన్ని చోట్లా పెరగడం ఆందోళన కలిగిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు