పౌష్టికాహారం పక్కదారి

5 Mar, 2019 14:42 IST|Sakshi
ఐసీడీఎస్‌ కార్యాలయం

గర్భిణులు, బాలింతల్లో అధికంగా 

రక్తహీనత బాధితులు 

రెండు నెలలుగా నిలిచిపోయిన కోడిగుడ్ల సరఫరా

పౌష్టికాహారం కూడా మాయం చేస్తున్న ఐసీడీఎస్‌ అధికారులు 

సాక్షి, అనంతపురం : జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం దారి మళ్లిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించడంలేదు. అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.  పేదలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారాన్నిపక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా గర్భిణులు, బాలింతలు రక్తహీనతతో అధికంగా బాధపడుతున్నారు. జిల్లాలో 5126 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. దాదాపు 3.35 లక్షల మందికి రోజూ పౌష్టికాహారం అందజేస్తున్నారు.

రోజూ మధ్యాహ్నం భోజనంతో పాటు ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాలి. దీంతో పాటు బాలామృతం స్థానంలో బాల సంజీవని ప్యాకెట్లు అందజేస్తున్నారు. పేద ప్రజల్లో రక్తహీనత తగ్గించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే ఏళ్ల తరబడి రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా అనుకున్న లక్ష్యాన్ని అంగన్‌వాడీ కేంద్రాలు అందుకోలేకపోతున్నాయి. ఇందుకు కారణం ఐసీడీఎస్‌లో వేళ్లూనుకుపోయిన అవినీతే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు అందినకాటికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 
రోజురోజుకూ పెరుగుతున్న రక్తహీనత బాధితులు :
రక్తహీనతతో బాధపడుతున్న వారికి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అన్నా సంజీవని ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. ఇందులో రాగిపిండి, గోధుమపిండి, కర్జూరం, బర్ఫీలతో కూడిని కిట్స్‌ను అందజేస్తున్నారు. అయితే కదిరి డివిజన్‌లో మాత్రం కిట్స్‌ను మాయం చేస్తున్నారన్న ఆరోపణలు  ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ పరిధిలో దారి మళ్లిస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. కేవలం కదిరిలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల్లో కోత వేసి పౌష్టికాహారాన్ని  పక్కదారి పట్టిస్తున్నారని తెలుస్తోంది.

 
అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లు నిల్‌ :
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు కొన్ని నెలలుగా కోడిగుడ్లు సరఫరా నిలిచిపోయింది. గత సరఫరా దారుల టెండరు గడువు ముగియడంతో కొత్తగా టెండర్లకు ఆహ్వానించారు. రెండురోజుల క్రితం ధర్మవరం డివిజన్‌ మినహా అన్ని డివిజన్లకు కోడిగుడ్లు సరఫరా టెండర్లను ఆమోదించారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలకు రెండునెలలుగా కోడిగుడ్ల సరఫరా ఆగిపోయింది. ప్రస్తుత కాంట్రాక్టర్లు సరఫరా చేయడానికి ఇంకా సమయం పడుతుంది. అంటే దాదాపు మూడు నెలలుగా కోడిగుడ్లు సరఫరా చేయలేదు. ఇదిలా ఉంటే ధర్మవరం డివిజన్‌లో కోడిగుడ్లు సరఫరా చేయాలంటే కాంట్రాక్టర్లు జంకుతున్నారు. అక్కడి అధికారపార్టీ నేతలకు, ఇతరులకు మామూళ్లు ఇచ్చుకోలేక టెండర్లలో దరఖాస్తులే రానట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే ఐసీడీఎస్‌లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అందరికీ పౌష్టికాహారం 
అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులకు పౌష్టికాహారంతో పాటు పాలు, కోడిగుడ్లు లబ్ధిదారులకు పారదర్శకంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేశాం. దీన్ని మరింత బలోపేతం చేస్తాం. అలాగే ఇటీవల ధర్మవరం డివిజన్‌ మినహా అన్ని డివిజన్లకు కోడిగుడ్ల కాంట్రాక్టర్లు ఖరారు చేశాం. త్వరలో అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా మొదలవుతుంది.
– చిన్మయాదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్‌ 

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు