ట్రిపుల్‌ఐటీకి రండి ఇలా...

2 Jul, 2018 11:40 IST|Sakshi
అకడమిక్‌ భవనం

4వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌

హాజరుకానున్న శ్రీకాకుళం నుంచి ప్రకాశం పరిధిలో విద్యార్థులు

ఇప్పటికే విద్యార్థులకు కాల్‌లెటర్లు

కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

సమీకృత ఇంజినీరింగ్‌ విద్యాబోధనకు నిలయమైన ట్రిపుల్‌ఐటీలో ఆహ్లాదకరమైన వాతావరణం, క్రమశిక్షణ, ఉత్తమ విద్యాబోధన నూజివీడు ట్రిపుల్‌ఐటీ సొంతం. ఆరుసంవత్సరాల కోర్సులో విద్యతో పాటు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి గాను ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, క్రీడలు, శాస్త్రీయ సంగీతం, నాట్యం, యోగ వంటి కోర్సులు కూడా ఇక్కడ ప్రత్యేకం. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఈనెల 4 నుంచి నుంచి 7వ తేదీ వరకు నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలకు కౌన్సెలింగ్‌ నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నిర్వహించనున్నారు. 2018–19 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ అందిస్తున్న సమగ్ర కథనం.

నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ఐటీలో  ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లో భాగంగా ఈనెల 4,5 తేదీల్లో నూజివీడు ట్రిపుల్‌ఐటీ అభ్యర్థులకు, 6,7న శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ  కౌన్సెలింగ్‌కు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు  చెందిన విద్యార్థులు పాల్గొననున్నారు. కౌన్సెలింగ్‌కు రావాల్సిన అభ్యర్థులందరికీ ఇప్పటికే ట్రిపుల్‌ఐటీ అధికారులు కాల్‌లెటర్లు పంపడంతో పాటు వారి సెల్‌ఫోన్‌లకు మెస్సేజ్‌లు ఇచ్చారు.

ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్‌ విద్యలో మొదటి రెండు సంవత్సరాలు ఇంటర్‌కు సమానమైన పీయూసీ కోర్సును, తరువాత నాలుగు సంవత్సరాలు ఇంజినీరింగ్‌ విద్య బోధిస్తారు.
ట్రిపుల్‌ఐటీలో చేరిన తరువాత విద్యార్థులు మొదటి రెండు సంవత్సరాలు ఏడాదికి రూ.36వేలు, తరువాత నాలుగు సంవత్సరాలు ఏడాదికి రూ.40వేలు చొప్పున చెల్లించాలి.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించిన నగదు పోను మిగిలిన సొమ్మును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది.  
అన్ని సబ్జెక్టులకు ప్రతినెలా పరీక్షలు ఉంటాయి. నాలుగు నెలల తరువాత సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి. ఆగస్టు ఒకటి నుంచి తరగతులు ప్రారంభమై  నవంబరు 30 వరకు తరగతులు ఉంటాయి. అనంతరం సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి.
సెలవు రోజులలో తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలతో గడపడానికి అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితులలో పిల్లలను అవసరమైతే ఇళ్లకు పంపుతారు. అయితే ఇచ్చిన గడువులోగా తిరిగి రాకపోతే ఫైన్‌ విధిస్తారు.
విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. దీనికి గాను ట్రిపుల్‌ఐటీ ఆవరణలోనే 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశారు. అందులో 24గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కిందకు రాని అభ్యర్థులకు రూ.36వేలు చెల్లించాల్సి ఉంది. కాబట్టి ‘ డైరెక్టర్, ఆర్జీయూట్రిపుల్‌ఐటీ నూజివీడు’ పేరున డీడీని ఏ జాతీయ బ్యాంకు నుంచైనా తీసుకుని ఇవ్వాలి.
రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద వెయ్యి రూపాయలు, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.500 చెల్లించాలి. అలాగే  రిఫండబుల్‌ కాషన్‌ డిపాజిట్‌ కింద ప్రతి అభ్యర్థి రూ.2వేలు అడ్మిషన్‌ సమయంలో చెల్లించాలి.

కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సినవి..
పదో తరగతి హాల్‌ టికెట్, గ్రేడ్‌షీట్, టీసీ, కాండక్ట్‌ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్‌(4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు), మీసేవా కేంద్రం నుంచి తీసుకున్న కులధ్రువీకరణ పత్రం, ఈ ఏడాది ఏప్రిల్‌ తరువాత మీసేవా కేంద్రం ద్వారా తీసుకున్న ఆదాయ ధ్రువపత్రం,  అభ్యర్థి, అతడి తండ్రిది గాని, తల్లిది కాని రెండు పాసుపోర్టు ఫొటోలు, రేషన్‌కార్డు, అభ్యర్థి ఆధార్‌కార్డు, విద్యార్థులకు ఎవరికైనా బ్యాంకు లోన్‌ అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు, అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఐడెంటీ కార్డు, శాలరీ సర్టిఫికెట్, అభ్యర్థి తండ్రి పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఓటర్‌ కార్డు తెచ్చుకోవాలి.

ఎలా రావాలంటే..
ప్రకాశం, గుంటూరు  జిల్లాల వైపు  నుంచి వచ్చేవారు విజయవాడ బస్టాండుకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి ప్రతి పది నిమిషాములకు నూజివీడుకు బస్సులున్నాయి. విజయవాడ నుంచి నూజివీడు 40కిలోమీటర్ల దూరం. నూజివీడు బస్టాండులో దిగిన తరువాత అక్కడి నుంచి మైలవరం రోడ్డులో ఉన్న ట్రిపుల్‌ఐటీకి నిత్యం ఆటోలు ఉంటాయి.
జ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు హనుమాన్‌జంక్షన్‌ బస్టాండులో గాని, రైల్వేస్టేషన్‌లో గాని దిగి రావచ్చు. అక్కడి నుంచి నూజివీడుకు నిత్యం బస్సులు, ఆటోలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు