ఏడాదికి కోటి జీతం

29 Jun, 2019 10:14 IST|Sakshi

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ మొదటి బ్యాచ్‌ విద్యార్థి ఘనత

పేద కుటుంబంలో పుట్టి.. అమెజాన్‌ మెట్లెక్కిన వైనం

వైఎస్సార్‌ మానస పుత్రికలు ట్రిపుల్‌ ఐటీలు

నూజివీడు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించాలనే ఆశయంతో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్థాపించిన ట్రిపుల్‌ ఐటీల లక్ష్యం నెరవేరుతోంది. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో 2008–14 సంవత్సరాల మధ్య చదివిన మొదటి బ్యాచ్‌ విద్యార్థి ఆడారి మణికుమార్‌ అమెరికాలోని అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజనీర్‌గా ఏడాదికి రూ.కోటికి పైగా వేతనంతో ఉద్యోగాన్ని సాధించారు.

విశాఖ జిల్లా మారుమూల గ్రామం నుంచి అమెరికాలో ఆకర్షణీయ ఉద్యోగం వరకు సాగిన మణికుమార్‌ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. విశాఖ జిల్లా చింతలగ్రహారం గ్రామానికి చెందిన ఆడారి రాము, మీనాక్షి దంపతుల ఏకైక కుమారుడు మణికుమార్‌. ఇతనికి ఇద్దరు తోబుట్టువులు. అదే గ్రామంలోని హైస్కూల్‌లో 2008లో పదో తరగతిలో 600కు గాను 548 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీటు దక్కించుకున్నారు. చదువుకుంటున్న రోజుల్లోనే ప్రముఖ ప్రోగ్రామింగ్‌ వెబ్‌సైట్లను అనుసరిస్తూ అల్గారిథమ్‌ సమస్యలకు పరిష్కారాలు కనుగొనే నైపుణ్యాన్ని సంపాదించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై పట్టు సాధించారు. మణికుమార్‌ బీటెక్‌ మూడో సంవత్సరంలో ఉండగానే అమెజాన్‌ మిషన్‌ లెర్నింగ్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు.

ఇష్టమే నడిపించింది
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మీద ఆసక్తి ఏర్పడటంతో మణికుమార్‌ అదే రంగంలో ఉద్యోగం చేయాలనుకున్నారు. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌కు వచ్చిన కంపెనీల్లో ఉద్యోగం నచ్చకపోవడంతో ఇంటర్వ్యూలకు హాజరు కాలేదు. బీటెక్‌ పూర్తయిన తర్వాత ఒక స్టార్టప్‌ కంపెనీలో ఏడాదికి రూ.8 లక్షల వేతనానికి చేరారు. దాన్ని స్నాప్‌డీల్‌ సంస్థ కొనుగోలు చేసింది. కొద్దికాలం అందులో పనిచేసిన అతనికి 2015లో అమెజాన్‌ సంస్థలో అవకాశం వచ్చింది. అమెజాన్‌కు ఇండియాలో రెండేళ్లు పనిచేశారు. అప్పట్లో ఏడాదికి రూ.18 లక్షల వేతనం అందుకునేవారు. తర్వాత ప్రమోషన్‌తోపాటు అదే కంపెనీకి అమెరికాలో పనిచేసే అవకాశం వచ్చింది. అమెరికాలో ఏడాదికి రూ.40 లక్షల వేతనంతో ఉద్యోగంలో చేరారు. రెండేళ్లు పనిచేశాక.. ప్రస్తుత వేతనం రూ.కోటి దాటింది.  

నిరుపేద కుటుంబం నుంచి..
మణికుమార్‌ తండ్రి ఆడారి రాము గ్రామంలో ఎలక్ట్రీషియన్‌ కాగా.. తల్లి వ్యవసాయ పనులకు వెళ్తుండేది. తనతోపాటు ఇద్దరు అక్కలను చదివించడానికి తల్లిదండ్రులు నిరంతరం శ్రమించడాన్ని చిన్నతనం నుంచే గమనిస్తూ వారి నుంచే ప్రేరణ పొందానని మణికుమార్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు