ప్రాణం తీసిన పేస్ బుక్ పరిచయం

16 Jul, 2014 11:56 IST|Sakshi
ప్రాణం తీసిన పేస్ బుక్ పరిచయం

గుంటూరు : ఆ యువతీ యువకులిద్దరివీ వేర్వేరు ప్రాంతాలు. ఇంటర్నెట్‌లో ఫేస్‌బుక్ సైట్ ద్వారా ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. స్నేహం పెరగటంతో పెద్దలకు తెలియకుండా తిరగటం మొదలెట్టారు. ఈ సరదాయే.. చివరికి ఆ యువతి ప్రాణాలను బైక్ ప్రమాద రూపంలో బలిగొంది. కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరానికి చెందిన ధీరజ్‌ సింగ్ కు చిలకలూరిపేటకు చెందిన విద్యార్థినితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంటర్ చదువుతున్న ఆ విద్యార్థిని సోమవారం ఇంటి వద్ద నుంచి బయలుదేరి ధీరజ్‌తో కలిసి బైక్‌పై నూజివీడు వెళ్లింది.

రాత్రి కావడంతో హాస్టల్‌లోకి అనుమతించకపోవడంతో ఇద్దరూ కలిసి బైక్‌పై గుంటూరు తిరిగి వస్తున్నారు. తెల్లవారుజామున చినకాకాని వద్దకు వచ్చేసరికి విద్యార్థిని కప్పుకున్న బెడ్‌షీట్ చక్రంలో ఇరుక్కుపోవటంతో బైక్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో విద్యార్థినికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా ధీరజ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు విద్యార్థిని తల్లిదండ్రుల మాత్రం తన కుమార్తెను ధీరజ్ చంపేశాడని ఆరోపిస్తున్నారు.
 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు