శాసనసభకు ఎన్నికైన మేము...

13 Jun, 2019 08:11 IST|Sakshi

చట్టసభలోకి తొలిసారిగా ముగ్గురు నేతలు

సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్ర శాసనసభ కొలువుదీరింది. ప్రజాక్షేత్రంలో విజయాన్ని దక్కించుకున్న జిల్లాకు చెందిన పదిమంది ఎమ్మెల్యేలు శాసనసభలో సభ్యులుగా ప్రమాణం చేశారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాసనసభ తొలి సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సభలో ఆరోసారి అడుగుపెడుతున్న ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం అత్యంత సీనియర్‌ నాయకుడిగా నిలిచారు. శాసనసభాపతిగా గురువారం ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే! రెడ్డి శాంతి, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, గొర్లె కిరణ్‌కుమార్‌ తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు.

ఎన్నో విశేషాలు
ఈసారి శాసనసభలో జిల్లాకు సంబంధించి అనేక విశేషాలున్నాయి. పది నియోజకవర్గాల్లో ఎనిమిది చోట్ల వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. 2014 ఎన్నికలలో మూడు స్థానాలకే పరిమితమైన వైఎస్సార్‌సీపీ ఈసారి మాత్రం తిరుగులేని ఆధి క్యం సాధించింది. అధికార పార్టీగా బరిలోకి దిగిన టీడీపీ చావుతప్పి లొట్టబోయి రెండు స్థానాలకు పరిమితమైంది. ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి బెందాళం అశోక్‌ రెండోసారి గెలుపొందారు. గత ఐదేళ్లలో జిల్లా మంత్రిగా చక్రం తిప్పిన కింజరాపు అచ్చెన్నాయుడికి టెక్కలిలో మరోసారి గె లుపొందడానికి ముచ్చెమటలు పట్టాయి.  ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఈసారి టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగా బుధవారం అడుగుపెట్టారు.

శాసనసభలో సీనియారిటీ...

ఎన్నోసారి ఎంతమంది ఎవరు
ఆరోసారి ఒకరు తమ్మినేని సీతారాం (ఆమదాలవలస)
ఐదోసారి ఇద్దరు ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం)
కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి)
నాలుగోసారి ఒకరు ధర్మాన కృష్ణదాస్‌ (నరసన్నపేట)
మూడోసారి ఒకరు కంబాల జోగులు (రాజాం)
రెండోసారి ఇద్దరు విశ్వాసరాయి కళావతి (పాలకొండ)
బెందాళం అశోక్‌ (ఇచ్ఛాపురం)
తొలిసారి ముగ్గురు రెడ్డి శాంతి (పాతపట్నం)
డాక్టరు సీదిరి అప్పలరాజు (పలాస)
గొర్లె కిరణ్‌కుమార్‌ (ఎచ్చెర్ల)

అత్యంత సీనియర్‌ తమ్మినేని
ఆమదాలవలస నుంచి ఆరోసారి విజయం సాధించిన తమ్మినేని సీతారాం జిల్లాలోనే సీనియర్‌ నాయకుడిగా నిలిచారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన ఆయన నాటి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పైడి శ్రీరామమూర్తిని ఓడించారు. 1985 ఎన్నికలలోనూ ఆయనపైనే గెలిచినా 1989లో మాత్రం పరాజయం తప్పలేదు. కానీ శ్రీకాకుళం రాజకీయ ఉద్దండుడైన బొడ్డేపల్లి రాజగోపాలరావును 1991 ఉప ఎన్నికలలో ఓడించి సంచలనం సృష్టించారు. టీడీపీ నుంచే 1994, 1999 ఎన్నికలలోనూ విజయం సాధించారు. అయితే 2004లో మాత్రం మహానేత డాక్టరు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో ఓటమి తప్పలేదు. తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసినా బొడ్డేపల్లి సత్యవతి చేతిలో ఓడిపోయారు. 2014లోనూ త్రుటిలో విజయం చేజారింది. ఇలా వరుసగా మూడుసార్లు ఓటమి ఎదురైనా మొక్కవోని దీక్షతో, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనంతో 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించారు. బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. శాసనసభాపతిగా గురువారం ఆయన ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. జిల్లా నుంచి ఈ పదవిని నిర్వహించిన మూడో వ్యక్తిగా సీతారాం నిలిచారు. గతంలో తంగి సత్యనారాయణ, కావలి ప్రతిభాభారతి స్పీకరుగా పనిచేశారు.

నాడు తమ్ముడు... నేడు అన్న...
నరసన్నపేట నియోజకవర్గం నుంచి 1989, 1999 ఎన్నికలలోనూ, తర్వాత శ్రీకాకుళం నుంచి 2004, 2009 ఎన్నికలలోనూ, తాజాగా 2019 ఎన్నికలలోనూ విజయం సాధించిన ధర్మాన ప్రసాదరావు నలుగురు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో పని చేశారు. ఇప్పుడు అదే నరసన్నపేట నుంచి నాలు గోసారి భారీ మెజార్టీతో గెలుపొందిన ఆయన అన్న ధర్మాన కృష్ణదాస్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో రోడ్లు–భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సోదరులిద్దరూ బుధవారం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

వీరెంతో ప్రత్యేకం...
ఎమ్మెల్యేగా మూడోసారి శాసనసభలో అడుగుపెట్టిన కంబాల జోగులు, రెండోసారి అడుగుపెట్టిన విశ్వాసరాయి కళావతి బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. రాజాం నియోజకవర్గంలో 2014 ఎన్నికలలో మాజీ స్పీకరు, మాజీ మంత్రి కావలి ప్రతిభాభారతిని, 2019 ఎన్నికలలో మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ను మట్టికరిపించిన ఘనత జోగులుకు దక్కుతుంది.

ఆ ముగ్గురికీ తొలి అడుగు...
2014 ఎన్నికలలో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసి త్రుటిలో ఓటమి పొందిన రెడ్డి శాంతి ఈసారి మాత్రం పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. గత ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలుపొంది తర్వాత చంద్రబాబు ప్రలోభాలతో టీడీపీలోకి ఫిరాయించిన కలమట వెంకటరమణను కంగుతినిపించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆమె బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక గౌతు కుటుంబానికి కంచుకోటగా ఉన్న పలాసలో శివాజీ వారసురాలు శిరీషపై భారీ విజయం సాధించిన డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయనతో పాటు ఎచ్చెర్ల నుంచి విజయం పొందిన గొర్లె కిరణ్‌కుమార్‌ కూడా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు వంటి సీనియర్‌ నాయకుడిని కిరణ్‌ అవలీలగా ఓడించారు.

మరిన్ని వార్తలు