రుణమాఫీ పరిశీలన వేగవంతం చేయాలి

13 Nov, 2014 03:41 IST|Sakshi

 ఒంగోలు టౌన్ : రైతులకు సంబంధించిన రుణమాఫీ జాబితా పరిశీలనను వేగవంతం చేయాలని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో రుణమాఫీ అమలుపై బుధవారం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తహశీల్దార్లు రుణమాఫీ జాబితాను వ్యవసాయ శాఖ అధికారుల వద్ద నుంచి సీడీ రూపంలో తీసుకుని పరిశీలన కోసం ఈ నెల 13వ తేదీకి జన్మభూమి కమిటీకి పంపించాలని ఆదేశించారు.

జిల్లాలో 7 లక్షల మంది రైతులు అర్హులు కాగా, రేషన్, ఆధార్ కార్డులు లేని జాబితాను పునఃపరిశీలించి అర్హుల జాబితాను తయారు చేయాలని కోరారు. రైతు రుణమాఫీ రూ.1.50 లక్షలుగా ప్రకటించినందున వ్యక్తిగతంగా కాకుండా కుటుంబం నేపథ్యంలో పరిశీలన జరగాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పరిశీలనను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే. యాకూబ్ నాయక్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఐ.ప్రకాష్‌కుమార్, ఎన్‌ఐసీ డీఐఓ మోహన్‌కృష్ణ, ఉద్యానశాఖ ఏడీ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు