ఇదేమి న్యాయం

20 Nov, 2014 01:51 IST|Sakshi
ఇదేమి న్యాయం

ప్రొద్దుటూరు క్రైం: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. జిల్లాలో పని చేస్తున్న 90 మంది ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రొద్దుటూరులోని జిల్లా అస్పత్రిలో యూనియన్ నాయకులతో పాటు పలువురు ఉద్యోగులు గదులకు తలుపులు వేసుకుని ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు.

జిల్లాలో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రితో పాటు రాయచోటి, పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, లక్కిరెడ్డిపల్లెలో వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు ఉన్నాయి. కడపలో ఉన్న డీసీహెచ్‌ఎస్ కార్యాలయం కూడా దీనికిందికే వస్తుంది. ఈ ఆస్పత్రుల్లో సుమారు 163 మందికిపైగా ఉద్యోగులు ఔట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్నారు. చాలీచాలని జీతాలు ఇస్తున్నాప్పటికీ భవిష్యత్తులో ఉద్యోగాలు క్రమబద్దీకరణ జరుగుతాయనే ఆశతో 15 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది జూన్ చివరినాటికే ఔట్‌సోర్సింగ్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆయా ఆస్పత్రుల్లోని సిబ్బంది అందరూ జూలై 1 నుంచి యధావిధిగా విధులు నిర్వహిస్తున్నారు. నాలుగు నెలలు పూర్తయినా వారికి గడువు పొడిగింపు ఉత్తర్వులు రాలేదు. కాస్త ఆలస్యంగానైనా వస్తాయని అందరూ భావించారు. నాలుగు నెలల జీతం ఇవ్వకపోగా అనూహ్యంగా వారిని తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ అయ్యూరుు.

 అన్ని ఆస్పత్రుల్లో నిరసన జ్వాలలు
 జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఏపీవీవీపీ ఆస్పత్రుల్లోని ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయంతో రగలిపోతున్నారు. తాజాగా వైద్య విధాన పరిషత్ కమిషనర్ నుంచి అందిన ఆదేశాల మేరకు కడప డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో ఒక పోస్టు మాత్రమే ఇచ్చారు. అలాగే రాయచోటిలో 8, పులివెందులలో 8, ప్రొద్దుటూరులో 42, రాజంపేటలో 8, లక్కిరెడ్డిపల్లెలో 6 మందికి మాత్రమే అనుమతి లభించింది. అన్ని ఆస్పత్రుల్లో సగం మందికిపైగా ఉద్యోగాలు కోల్పోవడంతో వారు రోడ్డున పడాల్సి వచ్చింది.

 ప్రొద్దుటూరులో ఆమరణ దీక్షకు పూనుకున్న ఉద్యోగులు
 తమ ఉద్యోగాలు గల్లంతయ్యాయని తెలియడంతో ఔట్‌సోర్సింగ్ కార్మికులు బుధవారం ఉదయం నుంచి విధులకు హాజరు కాలేదు. డీసీహెచ్‌ఎస్ రామేశ్వరుడుకు ఫోన్ చేసి యూనియన్ నాయకులు సమాచారం తెలుసుకున్నారు. డీసీహెచ్‌ఎస్ ఆస్పత్రికి వచ్చిన తర్వాత యూనియన్ నాయకులతోపాటు సిబ్బంది కలిశారు.

ప్రభుత్వం నుంచి ఇప్పుడే తనకు మెయిల్ వచ్చిందని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రద్దవుతున్నాయని తెలిసి చాలా బాధపడుతున్నానని డీసీహెచ్‌ఎస్ వారితో అన్నారు. మీ సానుభూతి మాకు అక్కర్లేదు... మీరు మాకు ఇచ్చిన వాగ్ధానాలు ఏమయ్యాయని యూనియన్ నాయకులు ఆయనను నిలదీశారు. ఇది  మొదటి జాబితా  మాత్రమేనని రెండో జాబితాలో  మరికొందరి పేర్లు వచ్చే అవకాశం ఉందని డీసీహెచ్‌ఎస్ ఉద్యోగులను సముదాయించే ప్రయత్నం చేశారు.

అయినా వారు వినిపించుకోలేదు. యూనియన్ నాయకుడు రామ్మోహన్‌రెడ్డితోపాటు మరికొందరు ఆస్పత్రి ప్రాంగణంలో కూర్చొని నిరసన తెలిపారు. అలాగే మరో యూనియన్ నాయకుడు శివకృష్ణ, రాజులతోపాటు 20 మంది సిబ్బంది గదిలో తలుపులు వేసుకుని ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఉద్యోగులందరినీ పూర్తిస్థాయిలో విధుల్లో తీసుకునేంత వరకు గదిలో నుంచి బయటికి రామన్నారు.  

ఒక వేళ ఎవరైనా మమ్మల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే పక్కనే పెట్రోలు బాటిళ్లు పెట్టుకుని ఉన్నామని, ఆత్మహత్య చేసుకోవడానికైనా వెనుకాడమని వారు హెచ్చరించారు. పోలీసులు పలుసార్లు వారి గది వద్దకెళ్లి పరిశీలించారు.

 ముఖ్యమైన సేవలు కొనసాగేదెలా..
 ఆస్పత్రిలో దోబీ, బార్బర్, ఎలక్ట్రీషియన్‌తోపాటు పలు ఔట్‌సోర్సింగ్ పోస్టులు రద్దయ్యాయి. ఆపరేషన్ జరగాలంటే బార్బర్, దోబీ అవసరమని వైద్యులు అంటున్నారు. వీరు లేకుంటే ఆపరేషన్ చేయడం చాలా కష్టమని తెలిపారు. అలాగే ఇంత పెద్ద ఆస్పత్రికి ఎలక్ట్రీషియన్ అవసరం ఉందన్నారు. ఉన్న ఒక్క ఎలక్ట్రీషియన్‌ను తొలగిస్తే ఎలా అని వైద్యులే అంటున్నారు.

రెండో రోజుల క్రితం ఉన్నట్టుండి ప్రసూతి వార్డులో విద్యుత్ సరఫరా ఆగిపోగా రాత్రంతా ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఓ డాక్టర్ తెలిపారు. కాగా 106 మందిలో కేవలం 42 మంది ఔట్‌సోర్సింగ్, 8 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవాలని ఆదేశాలు రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. గురువారం నుంచి దీర్ఘకాలిక సమ్మెకు యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వైద్యసేవలు కొనసాగించేది లేదని వారు కరాఖండిగా చెప్పారు.

>
మరిన్ని వార్తలు