ఇదేమి న్యాయం..!

21 Dec, 2014 02:43 IST|Sakshi
ఇదేమి న్యాయం..!

 సాక్షి ప్రతినిధి, కడప: కార్మికుల కు అండగా నిలవాల్సిన అధికారపార్టీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఊరికో నిర్ణయం.. పరిశ్రమకో న్యాయం అంటూ దమననీతిని ప్రదర్శిస్తున్నారు. ఆర్టీపీపీ కార్మికుల ఆందోళనను నీరుగార్చడంలో పోట్లదుర్తి బ్రదర్స్ సఫలీకృతులయ్యారు.
 
 తమ డిమాండ్లను  పరిష్కరించాలని కోరుతూ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో పనిచేస్తున్న కాంట్రాక్టుకార్మికులు  ఆందోళన బాట పట్టారు.  కార్మికులు ఆందోళన చేస్తుంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అధికారపార్టీ నేతలు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లకు అండగా నిలవాల్సింది పోయి వారి ఆందోళనను నీరుగార్చే చర్యలకు పాల్పడ్డారు.  
 
 అధికారపార్టీ నేత సురేష్‌నాయుడు  రాత్రికి రాత్రే వందమంది తన అనుచరులను ఆర్టీపీపీలో విధుల్లో చేర్పించారు. ఆర్టీపీపీ యాజమాన్యం, తెలుగుదేశం నేతల  చర్యలకు జంకిన  కొంతమంది కార్మికులు  ఆందోళన విరమించి  విధుల్లో చేరారు. దీంతో  మిగిలిన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  15 ఏళ్లుగా ఆర్టీపీపీ ప్లాంట్‌నే నమ్ముకుని జీవిస్తున్న  తమపై ‘పిచుకమీద బ్రహ్మస్త్రం’ అన్నటుగ్లా అధికారపార్టీ నేతల శైలి  ఉందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
 
 తెలుగుతమ్ముళ్ల వింతధోరణి
 ఎదుటోళ్లపై బురద వేయడమే  అధికారపార్టీ నేతలు  లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒకే నాయకుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నారు. అందుకు  రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోదరుడు సురేష్‌నాయుడు నిదర్శనంగా నిలుస్తున్నారు. భారతి, జువారి సిమెంటు ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు నిర్వహించిన ఆందోళనకు మద్దతు ఇచ్చిన ఆయన ఆర్టీపీపీ కార్మికులకు వ్యతిరేకంగా పావులు కదిపారు. యర్రగుంట్లలో ఒకలా, కలమల్లలో మరోలా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని పలువురు పేర్కొంటున్నారు.  కార్మికుల చర్యలను  అణిచివేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుతో వారికి వ్యతిరేకంగా కవ్వింపు చర్యలకు పాల్పడడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.
 

మరిన్ని వార్తలు