అట్టహాసంగా ప్రమాణ ఏర్పాట్లు

7 Jun, 2014 04:09 IST|Sakshi
అట్టహాసంగా ప్రమాణ ఏర్పాట్లు

* వేదిక వెనుక నాలుగు హెలిపాడ్ల ఏర్పాటు
* ఢిల్లీ వీఐపీలు, అతిథులు, పాత్రికేయుల కోసం రెండు ప్రత్యేక విమానాలు
* హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు, బస్సులు
* పూర్తికావచ్చిన పనులు..     నేటి సాయంత్రానికి ప్రాంగణం సిద్ధం
* విజయవాడ - గుంటూరు హైవేపై ఒక లైన్ మొత్తం వీఐపీలకే
* బాబు ప్రమాణ స్వీకార సభకు ప్రధాని నరేంద్రమోడీ రావట్లేదు: బీజేపీ

 
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుంటూరు సమీపంలోని కాజ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగసభ ప్రాంగణంలో వేదిక నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. 480 అడుగుల వేదికకు నాలుగు వైపులా బారికేడ్లు నిర్మించడంతో పాటు రెయిన్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో అంతర్గత రోడ్ల నిర్మాణం, వీఐపీ గ్యాలరీ, ప్రెస్ గ్యాలరీ, స్త్రీలకు, పురుషులకు వేరువేరుగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వెనుక భాగంలో నాలుగు హెలిపాడ్లను నిర్మించారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు వస్తున్న పలువురు ప్రముఖులు సొంతంగా ప్రత్యేక విమానాల్లో వస్తుండగా.. మరికొందరికీ టీడీపీ విమానాలను ఏర్పాటు చేస్తోంది.
 
ఢిల్లీ నుంచి వచ్చే అతిథులు, పాత్రికేయుల కోసం రెండు విమానాలు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే వారి సౌకర్యార్థం హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి  దక్షిణ మధ్య రైల్వే, ఆర్‌టీసీలు ప్రత్యేక రైళ్లు, బస్సులు నడుపుతున్నాయి. మరోవైపు.. గుంటూరు నుంచి విజయవాడ వరకు, గుంటూరు, విజయవాడ నగరాల్లో టీడీపీ శ్రేణులు భారీగా స్వాగత ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. రెండు నగరాల మధ్య వున్న జాతీయ రహదారి డివైడర్లలో టీడీపీ జెండాలతో భారీగా అలంకరించారు. వేదిక ఏర్పాట్లు శనివారం సాయంత్రానికే పూర్తికానున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్, బి రామాంజనేయులు, కడప జిల్లా కలెక్టర్ కోన శశిధర్, గుంటూరు జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్‌లు పనులను పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను గుంటూరు, కృష్ణా జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు పరిశీలించారు.
 
గన్నవరం విమానాశ్రయంలో భద్రత...
 చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర వీఐపీలు కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి వస్తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు భద్రత చర్యలు చేపట్టింది. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు నేతృత్వంలో పలు శాఖల అధికారులు విమానాశ్రయాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆదివారం ఎంట్రీపాస్ ఉన్న కార్లనే విమానాశ్రయంలోకి అనుమతించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, అధికారులు మినహా ఎవరినీ అనుమతించవద్దని ఆదేశించారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత తిరిగివెళ్లే వీఐపీలకు భోజన ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికోసం ప్రత్యేకంగా టెంట్‌లు వేయడంతోపాటు ఫ్యానులు, లైట్లు తదితర సదుపాయాలను సమకూర్చాలని చెప్పారు. ముఖ్యంగా వీఐపీల రాకపోకల కోసం విమానాశ్రయం నుంచి గుంటూరు జిల్లాలోని సభాప్రాంగణం వరకు జాతీయ రహదారి రెండు లైన్లులో ఒక లైనును కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ రూట్‌లో వీఐపీలకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతిస్తారన్నారు.
 
 పోలీసు సిబ్బంది ఆకలి కేకలు...
ఆదివారం రాత్రి 7.27 నిమిషాలకు చంద్రబాబు బహిరంగసభ వేదికపై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీసులు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం నుంచి పూర్తిస్థాయిలో పోలీసులు బందోబస్తు విధులకు హాజరు కావాల్సి ఉంది. సీమాంధ్రలోని అన్ని రేంజిల పరిధిలోని సుమారు 8,568 మంది పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు. పోలీస్ బలగాలను శుక్రవారం మధ్యాహ్నానానికే ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి తరలించారు. స్థానిక అధికారులు వర్సిటీలోని రెండు బ్లాకులు తీసుకుని ఒక్కొక్క తరగతి గదిని 50 మంది పోలీసులకు రాత్రి బసకు కేటాయించారు. అయితే.. వారందరికీ భోజనం ఏర్పాట్లు చేయకపోవటం, పులిహోర, పెరుగు ప్యాకెట్లు కానీ పంపిణీ చేయకపోవడంతో ఆకలితో గడపాల్సి వచ్చింది.
 
 బాబు ప్రమాణానికి ప్రధాని రావట్లేదు...

 బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావడం లేదని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిశోర్ హైదరాబాద్‌లో తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి రాజనాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, రవిశంకర్‌ప్రసాద్‌లతో సహా సుమారు పది మంది కేంద్రమంత్రులు వస్తున్నారని చెప్పారు. పార్టీ సీనియర్ నేత అద్వానీ కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన శుక్రవారం ‘సాక్షి’కి చెప్పారు. అలాగే.. ఎన్‌డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్ (మధ్యప్రదేశ్), రమణ్‌సింగ్ (ఛత్తీస్‌గఢ్), ప్రకాశ్‌సింగ్‌బాదల్ (పంజాబ్), మనోహర్‌పారికర్ (గోవా) హాజరుకానున్నట్టు తెలిపారు. ఒడిశా, తమిళనాడు సీఎంలు నవీన్‌పట్నాయక్, జయలలిత  హాజరవుతారని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పుల్లారావు తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కూడా కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు.  
 
గవర్నర్‌తో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అందిన ఆహ్వానం నేపథ్యంలో.. చంద్రబాబునాయుడు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యూరు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను, ఎవరెవరు హాజరుకానున్నదీ వివరించారు. ఇదిలావుంటే వేదపండితుల సూచన మేరకు చంద్రబాబు హైదరాబాద్ నగర శివార్లలోని సొంత ఫాంహౌజ్‌లో ఒక రాత్రి నిద్ర చేసేందుకు శుక్రవారం రాత్రి వెళ్లారు.

మరిన్ని వార్తలు