అప్పుడు అలా..ఇప్పుడు ఇలా!

2 Jun, 2018 13:06 IST|Sakshi
2014లో మహమ్మద్‌ ఇంటిపేరు కలిగిన వారికి ఇచ్చిన బీసీ సర్టిఫికెట్‌

ముస్లింలకు ఓసీ సర్టిఫికెట్ల జారీ

గతంలో బీసీ–ఈలు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వైనం

ఆందోళనలో విద్యార్థులు

భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు వస్తాయంటున్న తల్లిదండ్రులు

తాడేపల్లిరూరల్‌: తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టగానే అంచెలంచెలుగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు సంక్షేమ పథకాలను దూరం చేసేందుకు కొత్త కొత్త విధానాలను అమలు చేస్తోంది. దానిలో భాగంగా మహ్మద్‌ ఇంటి పేరు కలిగిన ముస్లిం లకు తీవ్ర ద్రోహం తలపెట్టింది. ప్రస్తుతం వారికి ఓసి సర్టిఫికెట్‌ ఇస్తాం, బిసి సర్టిఫికెట్లు ఇవ్వమంటూ చెప్పడంతో, చదువుకునే విద్యార్థుల్లోను, వారి తల్లిదండ్రుల్లోను ఆందోళన ప్రారంభమైంది. 2014లో బీసీ–ఈ గా క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన రెవెన్యూ అధికారులు ప్రస్తుతం ఓసి సర్టిఫికెట్‌ ఇస్తామని తెలపడంతో, గతంలో విద్యను అభ్యసించిన వారు బీసీ–ఈ సర్టిఫికెట్‌ పొంది ఉన్న వారు ఓసి సర్టిఫికెట్‌ తీసుకోవాలంటే ఆందోళన చెందుతున్నారు. 2014లో పదో తరగతి పూర్తిచేసుకున్న ఓ విద్యార్థి ప్రస్తుతం బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుకునేందుకు సర్టిఫికెట్‌ అవసరం కావడంతో మంగళగిరిలోని ఓ ఈ–సేవా కేంద్రంలో కుల ధ్రువీకరణ పత్రం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు.

అయితే ప్రస్తుతం మహ్మద్‌లకు బీసీ–ఈ సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదని, ఓసీ సర్టిఫికెట్‌ ఇస్తామని, కావాలంటే తీసుకోవచ్చని చెప్పడంతో, ఆ విద్యార్థి తల్లితండ్రులకు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. తల్లిదండ్రులు కూడా ఈసేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేయగా, వెబ్‌సైట్‌లో ఓసీ సర్టిఫికెట్టే ఓపెన్‌ అవుతుందని, బీసీ–ఈ ఓపెన్‌ కావడం లేదని, 2014 తర్వాత మహ్మద్‌లకు బీసీ సర్టిఫికెట్‌ ఇవ్వడంలేదని తెలియచేశారు. మీ ప్రాంతంలోని తహసీల్దార్‌ను వివరణ అడగాలని చెప్పడంతో తాడేపల్లికి చెందిన ఎం.డి.చాంద్‌బాషా తహసీల్దార్‌ను కలిసి తన గోడును వివరించుకున్నాడు. ఆయన జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ను కలిసి ఈ సమస్యను చెప్పుకోవాలని సూచించారు. 2014లో ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాలు 2018లో ఎందుకివ్వరో తెలిపాలని ప్రశ్నించినా, తహసీల్దార్‌ దగ్గరనుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో సామాన్యుడైన చాంద్‌బాషా ఏం చేయాలో అర్థంకాక వెనుదిరిగి వెళ్లాడు.

ఇప్పుడేం చేయాలి
నా కుమారుడు అమీర్‌కు 2014లో బీసీ–ఈ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ప్రస్తుతం కుల ధ్రువీకరణ పత్రం కావాలంటూ దరఖాస్తు చేసుకున్నాం. ఓసీ సర్టిఫికెట్‌ ఇస్తామంటున్నారు. ఒకే విద్యార్థి రెండు రకాల కుల ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉంటే, భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులకు తెలియదా. మహ్మద్‌ ఇంటిపేరు కలవారిని చిన్నచూపు చూస్తూ ఓసీలుగా ధ్రువీకరించడం ఏంటో అర్థం కావడంలేదు. –ఎండీ.చాంద్‌బాషా

లంచం ఇస్తే ఎలా ఇచ్చారు
వేరేవారికి ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాలను చూపించి, చేతులు తడిపితే తప్ప బీసీ–ఈ సర్టిఫికెట్‌ ఇవ్వలేదు. తాడేపల్లి మున్సిపాలిటీలో బీసీలకు కార్పొరేషన్‌ లోన్లు అందచేయడంతో వాటికి దరఖాస్తు చేసుకునేందుకు కుల ధ్రువీకరణ పత్రం అడిగాం. మొదట ఓసి సర్టిఫికెట్టే ఇస్తామన్నారు. నులకపేటలో మహ్మద్‌లకు ఇచ్చిన బీసీ–ఈ కుల ధ్రువీకరణపత్రాలను చూపించి చేతులు తడిపితే తప్ప ఇవ్వలేదు.
– ఎండీ మస్తాన్‌వలి

మరిన్ని వార్తలు