19 మంది లోపున్న బడులు మూసివేత

28 Sep, 2014 01:15 IST|Sakshi

విద్యార్థులు లేకుంటే సమీపంలోని పాఠశాలల్లో విలీనం
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ

 
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకర ణ (రేషనలైజేషన్)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ మేనేజ్‌మెంట్ల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉండాల్సిన విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 2013-14 డైస్ లెక్కల ఆధారంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ కోసం జిల్లా స్థాయిలో సాధికారిక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి సాధికారిక కమిటీకి చైర్మన్‌గా ఆ జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. జిల్లా విద్యాశాఖాధికారి సభ్య కార్యదర్శిగా, జాయింట్ కలెక్టర్, జెడ్పీ సీఈవో, ఐటీడీఏ పీవో, ఆర్వీఎం పీవో సభ్యులుగా ఉంటారు. రేషనలైజేషన్ ప్రక్రియ అమలుకు షెడ్యూల్, మార్గదర్శకాలు, సూచనలను జారీ చేయాల్సిందిగా పాఠశాల విద్యా కమిషనర్‌ను ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 19 మం దిలోపు పిల్లలున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను కిలోమీటరు పరిధిలోని ఇతర పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఆ స్కూళ్లలోని ఉపాధ్యాయ పోస్టులను విద్యార్థులున్న పాఠశాలలకు బదిలీ చేస్తారు. గిరి జన ప్రాంతాల్లో 19 మందిలోపు విద్యార్థులు ఉన్నా, లేకపోయినా కిలోమీటరు పరిధిలోని ఉన్న మరో ప్రభుత్వ లేదా సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో విలీనం చేస్తారు. ఒకవేళ కిలోమీటర్ పరిధిలో మరో పాఠశాల లేకపోతే కనీసం 15 మంది విద్యార్థులున్నా ఆ పాఠశాలను కొనసాగిస్తారు. ఇక ఈ హేతుబద్దీకరణపై 29న విద్యాశాఖ అధికారులు సమావేశమై షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. వచ్చే నెల చివరలో ఈ రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు.

ఇవీ మార్గదర్శకాలు..

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకరణలో భాగంగా ఉన్న పోస్టుల సర్దుబాటును మాత్రమే చేపడతారు. ఒక్క కొత్త పోస్టు కూడా సృష్టించరు.

ప్రాథమిక పాఠశాలల్లో..

19 మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలను కిలోమీటరు పరిధిలో ఉన్న మరో పాఠశాలలో విలీనం చేస్తారు. 20 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఎస్జీటీని ఇస్తారు. ఆ తరువాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను కేటాయిస్తారు. విద్యార్థుల సంఖ్య 151కి మించి ఉంటే ఒక ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంను ఇస్తారు. ఇక గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలను విలీనం చేయాల్సి వస్తే ఐటీడీఏ స్కూళ్లలో విలీనం చేస్తారు. పోస్టులను మాత్రం సంబంధిత యాజమాన్యంలోనే సర్దుబాటు చేస్తారు.

ప్రాథమికోన్నత పాఠశాలల్లో..

ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాల నిబంధనలే వర్తిస్తాయి. 6, 7, 8 తరగతుల్లో 19 మందికన్నా తక్కువగా విద్యార్థులు ఉంటే.. మూడు కిలోమీటర్ల పరిధిలోని ఉన్న మరో ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేస్తారు. 20 నుంచి 100 మంది విద్యార్థులున్న స్కూళ్లలో ఒక గణితం, ఒక ఆర్ట్స్ స్కూల్ అసిస్టెంట్, రెండు భాషా పండిట్ పోస్టులు ఉంటాయి. 101 నుంచి 140 మంది విద్యార్థులున్న స్కూళ్లలో గణితం టీచర్ పోస్టును అదనంగా ఇస్తారు. ఆ తరువాత ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టును అదనంగా ఇస్తారు. ఈ స్కూళ్లలో సీనియర్ అయిన స్కూల్ అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరించాలి. స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు వారి సబ్జెక్టులను బోధిస్తూనే, అవసరమైతే ప్రాథమిక తరగతుల్లో బోధించాలి.

ఉన్నత పాఠశాల్లో..

6 నుంచి పదో తరగతి వరకు 75 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలల(ఇంగ్లిష్ మీడియంతో సహా)ను మూసివేసి విద్యార్థులను సమీపంలోని స్కూల్‌లో నమోదు చేస్తారు. 75 నుంచి 220 మంది విద్యార్థుల వరకు ఉంటే.. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో టీచర్ చొప్పున 9 మందిని ఇస్తారు. ఆ తరువాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను అదనంగా ఇస్తారు. ఉన్నత పాఠశాలల్లో ఒక తరగతిలో కనీస విద్యార్థుల సంఖ్య 40 మంది. 60కి మించితే రెండో సెక్షన్‌ను, 100 మందికి మించితే మూడో సెక్షన్‌ను ఏర్పాటు చేయాలి. పోస్టులను ఒక స్కూల్ నుంచి మరో పాఠశాలకు మా ర్చే పక్షంలో విద్యార్థుల నమోదు, సెక్షన్లను దృష్టిలో పెట్టుకొని కమిటీ నిర్ణయం తీసుకోవాలి. ప్రాంతీయ సంయుక్త సంచాలకుడి అనుమతి లేకుం డా జెడ్పీ, మున్సిపల్ స్కూళ్లలో నిర్వహిస్తున్న అదన పు సెక్షన్లను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీచేయాలి.

మరికొన్ని నిబంధనలు..

 బాలికల పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లో కో-ఎడ్యుకేషన్/ బాలుర పాఠశాలల్లో విలీనం చేయొద్దు.  ఇంగ్లిషు మీడియం ఉన్న పాఠశాలల్లో 75 మందిలోపు పిల్లలు ఉంటే ఇంగ్లిషు మీడియం కోసం అదనంగా పోస్టులను ఇవ్వరు. 75 నుంచి 220 మంది వరకు పిల్లలున్న స్కూళ్లలో భాషేతర స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 4, 221 నుంచి 260 వరకు 6, 261 నుంచి 340 వరకు 7 పోస్టులు అదనంగా కేటాయిస్తారు. రేషనలైజేషన్‌లో సీనియారిటీ ప్రకారం జూనియర్ అయిన వారిని అదనపు టీచర్‌గా గుర్తిస్తారు.
 

మరిన్ని వార్తలు