అక్టోబర్ ఒకటి నుంచి ‘నగదు బదిలీ’

12 Sep, 2013 01:45 IST|Sakshi

సుబేదారి, న్యూస్‌లైన్ : అక్టోబర్ ఒకటో తేదీ నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకం అమలులోకి రానుంది. సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖ, మైనార్టీ విద్యార్థులకు చెందిన స్కాలర్‌షిప్‌లు, డీఆర్‌డీఏ-ఐకేపీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న పింఛన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న నిత్యావసర వస్తువుల లబ్ధిదారులను ఈ పథకంలోకి తీసుకొచ్చారు.

 ఏడు ఏజెన్సీల ద్వారా జిల్లాలో ఆధార్ కార్డుల అనుసంధానం కార్యక్రమాన్ని నిర్వహించారు. 35,22,089 మొత్తం జనాభా ఉండగా 32,94,161 మంది కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. 8,71,178 మందికి తెల్ల రేషన్ కార్డులు ఉండగా గిరిజన ప్రాంతాల్లో 44,080 మందికి కార్డులు ఉన్నాయి. వీరికి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ పథకం వర్తింపజేయనున్నారు. 2012-13లో బీసీ వెల్ఫేర్ ద్వారా 62,794 మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పౌరసరఫరాల విభాగం ఇప్పటికే రేషన్ కార్డులకు ఆధార్ కార్డులను అనుసంధానం చేసే కార్యక్రమం పూర్తిచేసింది.

ఇందులో వరంగల్ డివిజన్‌లో 3,41,546, జనగామలో 1,54,844, మహబూబాబాద్‌లో 1,90,397, ములుగులో 27,852, నర్సంపేటలో 44,080 మంది దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రజల రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఇక నుంచి లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాల నుంచి తమ నగదు బదిలీని పొందాల్సి ఉంటుంది. రేషన్ దుకాణాల నుంచి ఇచ్చే నిత్యావసర సరుకులు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, సామాజిక భద్రత పింఛన్లు నగదు బదిలీ ద్వారా పొందే అవకాశం ఉంటుంది.
 

మరిన్ని వార్తలు