ఎక్సైజ్ తీరు ‘మామూళ్లే’!

5 Feb, 2016 03:46 IST|Sakshi
ఎక్సైజ్ తీరు ‘మామూళ్లే’!

మద్యం వ్యాపారులు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. వారిని నియంత్రించాల్సిన అధికారులు ‘మామూళ్ల’ పేరిట ప్రోత్సహిస్తుండడంతో దుకాణాల వద్ద నిబంధనలకు తూట్లుపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎమ్మార్పీకి మద్యం విక్రయించడం లేదు. పొరుగు జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ తాను ఎమ్మార్పీకి మించి రూపాయి కూడా అదనంగా అమ్మేది లేదని ఖరాఖండిగా చెప్పేసినా అధికారులు అంగీకరించలేదు. ఎమ్మార్పీపై రూ. ఐదు నుంచి రూ. 10 వరకు విక్రయిస్తేనే దుకాణం ఉంటుందని.. లేకపోతే కేసులు తప్పవని బెదిరిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి.

వ్యాపారులను తమ దారికి తెచ్చుకునేందుకు ఎక్సైజ్ అధికారులు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. దుకాణాలు, బెల్ట్ షాపులు, జాతీయ రహదారిపై ఉన్న దుకాణాలు, బార్‌ల నుంచి నెలవారీ వసూళ్లకు జిల్లా వ్యాప్తంగా ఒక సీఐని నియమించినట్టు సమాచారం. ఎక్సైజ్‌శాఖ సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నా వారిలో మార్పు కనిపించడం లేదు. ఎవరు ఏమనుకుంటే తమకేమిటి అన్నట్టు వ్యవహరిస్తున్నారు.దీంతో వ్యాపారులు పెట్రేగిపోతున్నారు. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడుకు ఎన్నికల సమయంలో నిధులు సమకూర్చిన ఓ మద్యం వ్యాపారి జిల్లాలో ఇప్పుడు హవా చలాయిస్తున్నారు.

రాజకీయంగా మంత్రి సన్నిహితుడిగా పేరొందిన ఆ వ్యక్తి చక్రం తిప్పుతున్నారు. అందుబాటులో ఉన్న అన్ని దుకాణాలను చేజిక్కించుకొని తాను చెప్పిందే వేదం అంటూ వ్యాపారుల్ని తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి చెప్పారు అంటూ తనకు కావాల్సినట్టుగా పనులు చేయించుకున్నట్టు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 238 దుకాణాలతోపాటు 15 బార్లు, సుమారు ఐదు వేల బెల్ట్ దుకాణాలు, జాతీయ రహదారికి సమీపంలో ఉన్న 58 దుకాణాలను లెక్కించి పద్దులు రాసే పనిని ప్రారంభించారు. ఒక్కో దుకాణం నుంచి నెలకు అర్బన్ ప్రాంతాల్లో రూ. 57,500, రూరల్ ప్రాంతాల్లో రూ. 37,500 వసూలు చేసినట్టు తెలిసింది.

ఈ మొత్తంలో జిల్లా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతోపాటు జిల్లా మంత్రికి కూడా పంపకాలు చేయాలంటూ ఓ వ్యాపారి సమాచారం పంపిస్తున్నట్టు భోగట్టా. రానున్న జూలైలో మద్యం పాలసీ గడువు ముగుస్తుండడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వ్యాపారులు కూడా అధికారులు చెప్పినట్టు నడుచుకోవాల్సి వస్తోంది. అంతేకాకుండా జిల్లా మంత్రి కూడా తాను మంత్రిగా ఉన్నంతకాలం ధీమాగా ఉండొచ్చని, ఎలాంటి ఇబ్బందులూ రావని చెబుతున్నట్టు తెలిసింది.


 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏదీ?జిల్లాలో అడపాదడపా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ సిబ్బంది దాడులు చేస్తున్నా బయటకు రావడం లేదు. కేసులు ఎక్కడా కనిపించడం లేదు. అధికారులంతా ఏపీ-ఒడిశా సరిహద్దులో నల్లబెల్లం, నాటుసారా తయారీపై దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల మద్యం దుకాణదారుల నుంచి మామూళ్ల పేరిట రూ. 85 వేలు వసూలు చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. దీంతో కొన్నాళ్లపాటు స్థబ్దుగా ఉండిపోవాలని అధికారులు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అదేవిధంగా రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అప్పుడప్పుడూ తనిఖీలకు వస్తున్నా ఫలితం లేకుండా పోయింది.

స్థానిక సిబ్బంది ముందుగానే అధికారుల రాకను పసిగట్టి మద్యం వ్యాపారులకు సమాచారం ఇచ్చేస్తుండడంతో కేసుల నమోదుపై ప్రభావం పడింది. ఒకవేళ కేసు నమోదు చేసినా రూ. లక్ష అపరాధ రుసుము చెల్లించేస్తే వెంటనే మాఫీ అయిపోతుందన్న ధీమా వ్యాపారుల్లో ఉంది. దీంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ సిబ్బంది జాడ కనిపించకపోవడం, టాస్క్‌ఫోర్స్ సేవలు తగ్గిపోవడం జరుగుతోంది. దీనినే ఆసరాగా తీసుకున్న స్థానిక ఎక్సైజ్ సిబ్బంది మామూళ్లు పెంచేశారని తెలిసింది. వ్యాపారులు తమకు నచ్చినట్టుగా విక్రయాలు చేసుకోవచ్చని మౌకిక ఆదేశాలిచ్చినట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు