సరెండర్ శిక్షకు మాఫీ పూత!

28 Jul, 2014 02:31 IST|Sakshi

 ఒక అధికారిని జిల్లా ఉన్నతాధికారి సరెండర్ చేశారు. ఆ వెంటనే ఆ ఉన్నతాధికారి బదిలీపై వెళ్లిపోయారు. ఇదే అదనుగా సరెండర్ వ్యవహారాన్ని మాఫీ చేయించుకునేందుకు ఆ అధికారి లాబీయింగ్ చేస్తున్నారు. అధికార పార్టీ నేతల కాళ్లావేళ్లా పడుతున్నారు. సరెండర్ ఆపించండి.. లేదా గౌరవప్రదంగా బదిలీ అయ్యేలా అయినా చూడండని వేడుకుంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు ఈయన ఖాళీ చేసే సీటును తన్నుకుపోయేందుకు ఇదే శాఖలోని ఇద్దరు అధికారులు తెగ ప్రయత్నిస్తున్నారు. కొన్నాళ్లుగా అత్యంత గోప్యంగా సాగుతున్న ఈ తతంగం ఆ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
 ఎచ్చెర్ల క్యాంపస్: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారన్న ఆరోపణతో జిల్లా పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారిని గత కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఈ నెల 14న ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఇది జరిగిన రెండు రోజులకే కలెక్టర్ బదిలీపై వెళ్లటంతో సరెండర్ వ్యవహారాన్ని తెరమరుగు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ నాయకుల ఆశీస్సులతో ఈ వ్యవహారాన్ని మాఫీ చేసేందుకు వీలుగా విషయాన్ని ఆ శాఖ అధికారులు గోప్యంగా ఉంచారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎచ్చెర్ల, పోలాకి తదితర ప్రాంతాల్లో పశువుల ఆస్పత్రులను గత కలెక్టర్ పరిశీలించినప్పుడు వాటి పనితీరు ఆశాజనకంగా లేకపోవటం, జిల్లాస్థాయి సమీక్ష సమావేశాలకు ఆ అధికారి హాజరుకాకుండా తన సబార్డినేట్లను పంపించటం, కార్యాచరణ ప్రణాళికలు, భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో నిర్లక్ష్య వైఖరి, నిధుల వినియోగంలో పారదర్శకత లోపించడం వంటి కారణాలతో పలుమార్లు కలెక్టర్ ఆయన్ను మందలించినా.. పనితీరులో మార్పు లేకపోవడంతో సరెండర్ చేసినుట్ల తెలిసింది. సంబంధిత ఫైల్లోనూ ఇదే నోట్ రాసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫైల్ పశుసంవర్థక శాఖ రాష్ట్ర డెరైక్టర్ కార్యాలయంలో ఉంది. అక్కడి నుంచి ప్రిన్సిపాల్ సెక్రటరీకి వెళితేనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ డెరైక్టర్ కార్యాలయం నుంచి అది ముందుక కదలకుండా సరెండర్‌కు గురైన అధికారి అడ్డుచక్రం వేసినట్లు తెలిసింది.
 
 విస్తృత లాబీయింగ్
 విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి.. రాజకీయ లాబీయింగ్ ద్వారా పూర్తిగా మరుగుపరిచేందుకు సదరు అధికారు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన.. ఆయన తరఫువారు మంత్రి అచ్చెన్నాయుడు, విప్ కూన రవికుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి తదితరులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వారి నుంచి ఎటువంటి హామీ లభించలేదని తెలిసింది. రెండు విధాలుగా మాఫీకి ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలిసింది. సరైన కారణాలు లేకుండానే సరెండర్ చేశారని పేర్కొంటూ ఫైల్‌ను మూసి వేయించడం మొదటి ప్రయత్నం కాగా.. అది కుదరకపోతే సరెండర్ రూపంలో కాకుండా వేరే జిల్లాకు బదిలీ చేసి గౌరవంగా పంపేయడం రెండో ప్రయత్నంగా వీరి లాబీయింగ్ కొనసాగుతోంది. రాజకీయ, అధికార పలుకుబడి ఉన్న పశుసంవర్థక శాఖకు చెందిన కొందరు అధికారులు కూడా ఈయన తరఫున రాయబారాలు నడుపుతున్నట్లు తెలిసింది. వీరి ప్రయత్నాలు ఇలా ఉంటే.. మరోవైపు ఈయన ఖాళీ చేసే సీటును ఆక్రమించుకునేందుకు ఇద్దరు అధికారులు పోటీ పడుతున్నారు. ఎవరికిస్థాయిలో వారు రాజకీయ, అధికార పలుకుబడిని ప్రయోగిస్తున్నారు. వీరిలో ఒకరు ఏ ఎండకాగొడుగు పట్టే జిల్లా అధికారి కాగా.. మరొకరు ఉన్నతాధికారుల అండదండలతో ఆకాశానికి నిచ్చెనలు వేసే డివిజన్ అధికారి. ఈ పరిణామాలన్నీ ఆ శాఖలో కలకలం రేపుతున్నా బహిరంగంగా మాట్లాడేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు.
 
 మా దృష్టికి రాలేదు
 పశుసంవర్థక శాఖ అధికారిని సరెండర్ చేసిన విషయం తన దృష్టికి రాలేదని రాష్ట్ర పశు సంవర్థక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ కె.కృష్ణ మూర్తి ఫోన్‌లో చెప్పారు. ఇదే విషయంపై రాష్ట్ర డెరైక్టర్ కొండలరావును ‘సాక్షి’ ఫోన్‌లో వివరణ కోరగా మాట్లాడేందకు ఆయన ఆసక్తి చూపలేదు.
 

మరిన్ని వార్తలు