‘సచివాలయ’ సేవలు 500 పైనే..

2 Oct, 2019 03:58 IST|Sakshi

కొన్ని సేవలు దరఖాస్తు చేయగానే అందజేత 

కొన్ని 72 గంటల్లోగా.. 

మరికొన్ని 72 గంటల తర్వాత 

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవలను మూడు విభాగాలుగా అధికారులు వర్గీకరించారు. దరఖాస్తు చేయగానే అక్కడికక్కడే అందించేవి, 72 గంటల్లోగా అందించేవి, 72 గంటలు దాటిన తరువాత అందించే సేవలుగా విభజించారు. మొత్తం 500కు పైగా సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏయే సేవలను ఏ సమయంలోగా అందించాలన్న దానిపై సమాలోచనలు సాగిస్తున్నారు.

వివిధ శాఖలకు చెందిన 47 రకాల సేవలను అప్పటికప్పుడే 15 నిమిషాల్లో అందించేలాగ ఏర్పాట్లు చేస్తున్నారు. 148 రకాల సేవలను దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా అందించవచ్చని అధికారులు గుర్తించారు. పింఛన్, రేషన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు తదితర కీలక పథకాలను దరఖాస్తు చేసిన 72 గంటల్లోగా మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 72 గంటల కంటే ఎక్కువ సమయంలో 311 రకాల సేవలను అందించవచ్చని అధికారులు గుర్తించారు. 

ప్రత్యేక పోర్టల్‌కు రూపకల్పన 
అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పోర్టల్‌ రూపొందిస్తున్నారు. ఈ పోర్టల్‌ను ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డుతో పాటు సంబంధిత శాఖలకు అనుసంధానిస్తారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులకు నిధులిచ్చే దాతల కోసం ప్రత్యేకంగా మరో పోర్టల్‌ను రూపొందించనున్నారు. 

మరిన్ని వార్తలు