ఆఫీసుల్లోనే అంచనాలు

9 Nov, 2013 01:41 IST|Sakshi

 సాక్షి, నరసరావుపేట
 ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. పంటల నష్టం అంచనా వేసేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి అధికారులు ఒక బృందంగా  ఏర్పడి గ్రామాల్లో తిరిగి రైతుల జాబితాను తయారు చేయాల్సి ఉంది. దీని ఆధారంగా ప్రభుత్వం పరిహారం అందించనుంది. అయితే నష్టం అంచనాలో అధికారులు అవలంబిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రతి గ్రామంలో గ్రామ కార్యదర్శి, రెవెన్యూ అధికారి, వ్యవసాయశాఖ సిబ్బంది కలిసి ఓ బృందంగా ఏర్పడి పొలాలను సందర్శించి నష్టపోయిన రైతుల జాబితాను తయారు చేయాల్సి ఉంది. అయితే వారంలోగా  జాబితా తయారు చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఏం చేయాలో పాలుపోని అధికారులు తమ కార్యాలయాల్లోనే కూర్చొని తూ తూ మంత్రంగా జాబితా తయారు చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
 
 మండలాల్లో గ్రామాలు అధికంగా ఉండి సిబ్బంది తక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఇచ్చిన సమయానికి జాబితా తయారు చేయలేమోననే భయంతో కిందిస్థాయి అధికారులు జాబితాను హడావుడిగా తయారు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ. 10వేల చొప్పున పరిహారం అందిస్తామంటూ ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధానంగా జీడిమామిడి, మామిడి, సపోట, జామ, బత్తాయి, దానిమ్మ తోటలకు హెక్టారుకు 15వేల రూపాయలు, తమలపాకుల తోటకు సెం టుకు రూ. 300, పసుపుకు హెక్టారుకు రూ.4500 అందించేందుకు ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రభుత్వం అందించనున్న  నష్టపరిహారంతో అప్పులన్నీ తీర్చుకోలేకపోయినా గుడ్డిలో మెల్లలా ఎంతోకొంత వస్తుందని రైతులు ఆశతో ఉన్నారు. అయితే గతంలో నీలం తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న సమయంలో కూడా పరిహారం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ నష్టపరిహారం అందించకపోవడంతో రైతులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
 
 50 శాతం పంటలు దెబ్బతిన్న రైతులకు మాత్రమే పరిహారం.. పంటలు దెబ్బతిన్న ప్రతి ఒక్క రైతుకు పరిహారం అందిస్తామంటూ చెబుతూనే ప్రభుత్వం, అంచనాకు వెళ్లే అధికారులకు 50 శాతం పైగా పంటలు దెబ్బతిన్న రైతుల జాబితాను మాత్రమే తయారు చేయాలంటూ మెలిక పెట్టింది. ప్రభుత్వ నిబంధనలను అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు తమ ఇష్టమొచ్చిన వారి పేర్లను జాబితాలో చేరుస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.గ్రామాల్లో అధికార పార్టీనేతలు, ఆదర్శ రైతులు అందించిన నష్టపరిహార జాబితాలనే అధికారులు ఖరారు చేస్తూ కార్యాలయాలకే పరిమితమవుతున్నారు.  ఫైనల్ జాబితాలో వారి పేర్లు మాత్రమే చేరుస్తుండటంతో నిజమైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. గత నీలం తుపాను సమయంలో కూడా అధికారులు ఇదే తీరున వ్యవహరించడంతో రైతులు అప్పట్లో రోడ్లపైకి చేరి ధర్నా లు, రాస్తారోకోలు చేశారు. అయితే పంట నష్టపరిహార జాబితా తయారు కాగానే ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో మూడు రోజుల పాటు ఉంచుతామని, అభ్యంతరాలు ఉంటే సంబంధిత తహశీల్దార్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు