లూజ్ పత్తిపై అధికారుల నిఘా?

17 Dec, 2013 05:50 IST|Sakshi

జమ్మికుంట, న్యూస్‌లైన్: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లోకి వస్తున్న లూజ్ పత్తిపై అధికారుల నిఘా మొదలైంది. లూజ్ పత్తికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో.. ఇదే పత్తిని గ్రామాల్లో వ్యాపారులు కొనుగోలు చేస్తూ మార్కెట్‌కు తరలిస్తున్నారనే అనుమానం అధికారుల్లో కలిగింది. దీంతో ఈవైపుగా అధికారులు దృష్టి సారించారు. సోమవారం పత్తి మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు 33 టాటా ఏసీల్లో 250 క్వింటాళ్ల లూజ్ పత్తిని తీసుకొచ్చారు.

వచ్చిన పత్తిలో గరిష్టంగా రూ.4460, కనిష్టంగా రూ.4000 వరకు పలికింది. అయితే పాట అనంతరం మార్కెట్ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, అసిస్టెంట్ కార్యదర్శి విజయ్‌కుమార్, సిబ్బంది గౌస్ వాహనాల్లో వచ్చిన రైతుల వివరాలు సేకరించారు. అడ్తి కమిషన్ ఎంత తీసుకుంటున్నారని తెలుసుకున్నారు. కొందరు అడ్తి కమిషన్ వివరాలు చెప్పకపోవడంతో అనుమానం వచ్చి పత్తి వాహనాలను పక్కకు పెట్టించారు. అడ్తిదారులు తమ రైతులేనని తెల్చడంతో విడిచిపెట్టారు.  
 యంత్రాలకు ముద్రలు తప్పనిసరి
 మార్కెట్లో ఎలాక్ట్రానిక్ కాంటాలపై తూనికలు, కొలతల అధికారుల ముద్రలు తప్పనిసరిగా ఉండాలని మార్కెట్ కార్యదర్శి తెలిపారు. నిబంధనలు పాటించని అడ్తీదారుల క్రయవిక్రయాలను కొద్ది సేపు నిలిపి వేశారు. అంతేకాకుండా రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వే బ్రిడ్జిపై సరుకులు ఉచితంగా తూకం వేస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు