రొయ్యల సేద్యం రాజేసి

11 Sep, 2014 01:10 IST|Sakshi
రొయ్యల సేద్యం రాజేసి

చీరాల : తీర ప్రాంతం డాలర్ సేద్యానికి కేంద్రంగా మారింది. ప్రభుత్వ భూములు ఆక్రమించి ఏటా వందల కోట్ల రూపాయల రొయ్యల వ్యాపారం సాగుతున్నా సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. కొంచెం కండబలం ... రాజకీయ దర్పం ఉంటే చాలు సర్కారు భూమి తమదేనన్నట్టుగా పాగా వేస్తున్నారు. ఈ ఆక్రమణదారుల్లో అధికంగా ప్రజాప్రతినిధులు, వీరి వెనుక చోటామోటా రాజకీయ నేతలతోపాటు బడాబాబులూ ఉన్నారు.

 చీరాల మండలంలోని కుందేరు భూములు నాయినిపల్లి నుంచి మోటుపల్లి వరకు కనీసం 400 ఎకరాలు ఆక్రమణలో ఉంది. ఎకరం కనీసం ఈ ప్రాంతాల్లో రూ.10-రూ.30 లక్షల వరకూ ధర పలుకుతోంది. ఈ భూములను చేజిక్కించుకొని రొయ్యల చెరువులు తవ్వి రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా వేటపాలెం నుంచి ఈ ఆక్రమణల పర్వం మొదలై చినగంజాం వరకు పాకింది.

 రొంపేరు భూములూ హాంఫట్...
 రొంపేరు కాలువ ఇరువైపులా ఉండే 300 ఎకరాలకుపైగా సర్కారు భూముల్లో రొయ్యల దందా సాగుతోంది. వేటపాలెం నుంచి చినగంజాం వరకు వందలాది ఎకరాలు రొయ్యల చెరువులుగా మారిపోయాయి. ముఖ్యంగా ‘వెనామీ’ సాగు లాభసాటిగా మారుతుండడంతో అటువైపు ఆక్రమణదారులు అడుగులు వేస్తున్నారు.  దీంతో చెరువుల లీజులు భారీగా పెరిగిపోయాయి. గత ఏడాది రూ.లక్ష వరకు ఎకరాకు లీజు ఉండగా, ప్రస్తుతం అది కాస్తా రూ.1.70 లక్షల వరకూ పెరిగింది. ఒక్కొక్కరు  3 నుంచి 4 ఎకరాల వరకు సర్కారు భూమిని ఆధీనంలో పెట్టుకుని ఎటువంటి పెట్టుబడి లేకుండా ఏడాదికి లక్షలాది రూపాయలను లీజు పేరుతో వెనుకేసుకుంటున్నారు.

 ఆక్రమణలపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం:  డ్రైనేజీ డీఈ సబ్బారావు
 కుందేరు, రొంపేరుకు రెండు ైవైపులా ఆక్రమణలున్న విషయం నిజమే. చాలామంది రొయ్యలు చెరువులు సాగు చేశారు. కుందేరులో ఆక్రమణదారులకు గతంలో రెండుసార్లు, రొంపేరు ఆక్రమణ దారులకు నాలుగుసార్లు నోటీసులు జారీచేశాం. త్వరలో రొంపేరులో ఆధునికీకరణ పనులు జరుగుతున్నందున ఈ ఆక్రమణలు తొలగించాల్సి ఉంది. ఈ ఆక్రమణల వ్యవహారంపై త్వరలో ఉన్నతాధికారులకు నివేదించి వారి ఆదేశాల మేరకు ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం.

>
మరిన్ని వార్తలు