జనాభా లెక్క తేలుస్తారు..

14 Dec, 2019 08:54 IST|Sakshi

నేషనల్‌ పాపులేషన్‌ రిజిష్టర్‌ తయారీ 

హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌ తొలిసారిగా యాప్‌లు ఆధార్‌ అనుసంధానం 

జనాభా లెక్కల సేకరణ కోసం అధికారులు సమాయత్తమవుతున్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో 45 రోజుల్లో నేషనల్‌ పాపులేషన్‌ రిజిష్టర్‌ తయారీ నిర్వహిస్తారు. 2021 ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ వరకు పాపులేషన్‌ ఎన్యుమరేషన్‌ నిర్వహించి మార్చిలో వివరాలు ప్రకటిస్తారు. సెన్సెస్‌ కోసం తొలిసారిగా మూడు యాప్‌లు వినియోగించనున్నారు. కచ్చితమైన జనాభా సంఖ్యను తేల్చేందుకు ఆధార్‌తో అనుసంధానించనున్నారు. ఇప్పటికే మాస్టర్‌ ట్రైనర్లకు డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సెస్‌ ఆపరేషన్స్‌ అధికారులు శిక్షణ ఇచ్చారు.

సాక్షి, కడప: ప్రతి పదేళ్లకు ఓసారి జనాభా లెక్కలు తయారు చేస్తారు. 2021 జనాభా లెక్కల సేకరణకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటివరకు వివరాల సేకరణ, నమోదు మాన్యువల్‌గానే సాగింది. ఈసారి కొత్తగా మూడు యాప్‌లు వినియోగిస్తున్నారు. కేవలం యాప్‌లనే నమ్ముకుంటే సాంకేతిక అవరోధాలు ఉత్పన్నమైతే మొదటికే మోసం వచ్చే వస్తుంది. అందుకే యాప్‌లతోపాటు మాన్యువల్‌గా కూడా వివరాలు సేకరించి నమోదు చేయనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం, గుంటూరుజిల్లా నరసరావుపేటలో ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రయోగాత్మకంగా పాపులేషన్‌ సెన్సెస్‌ నిర్వహించారు. సత్ఫలితాలు రావడంతో రాష్ట్రమంతటా నిర్వహించాలని నిర్ణయించారు.

అధికారులు వీరే:
జన గణన–2021 కార్యక్రమానికి కలెక్టర్‌ ప్రిన్సిపల్‌ సెన్సెస్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ఆయా మున్సిపాలిటీలకు కమిషనర్లు ప్రిన్సిపల్‌ సెన్సెస్‌ అధికారులుగా ఉంటారు. ఆర్డీఓలు సబ్‌ డివిజన్‌ సెన్సెస్‌ అధికారులుగా, తహసీల్దార్లు మండల చార్జ్‌ ఆఫీసర్లుగా, ఎంపీడీఓలు అడిషనల్‌ చార్జ్‌ ఆఫీసర్లుగా ఉంటారు.  

నేషనల్‌ పాపులేషన్‌ రిజిష్టర్‌ 
2020 ఏప్రిల్‌ నుంచి నేషనల్‌ పాపులేషన్‌ రిజిష్టర్‌ తయారు చేస్తారు. జనాభా, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, వలస తదితర వివరాలు నమోదు చేస్తారు. రెండు తరాల కుటుంబ సభ్యుల వివరాలను ప్రజలు అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. స్వస్థలం ఏదీ? ఎప్పటి నుంచి ఇక్కడ నివాసముంటున్నారు? ఏమి చేస్తున్నారు? తదితర వివరాలు సెన్సెస్‌ అధికారులకు తెలపాలి. అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో నేషనల్‌ రిజిష్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌సీ) తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెన్సెస్‌లో భాగంగా తయారు చేయనున్న నేషనల్‌ పాపులేషన్‌ రిజిష్టర్‌ ఇందుకు దోహదపడుతుంది. ఎన్‌పీఆర్‌ ఆధారంగానే ఎన్‌ఆర్‌సీ రూపొందిస్తారు. దీంతోపాటు హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌ కూడా నిర్వహిస్తారు.  

జిల్లా జనాభా వివరాలు
2011 సెన్సెస్‌ ప్రకారం జిల్లాలో 28.82 లక్షల జనాభా ఉంది. పురుషులు 14.52 లక్షలు, మహిళలు 14.03 లక్షలు. గ్రామీణ ప్రాంతాల్లో 19.03 లక్షల మంది జనాభా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 9.79 లక్షల మంది ఉన్నారు. సెక్స్‌ రేషియో పరిశీలిస్తే ప్రతి వెయ్యి మంది పురుషులకు 985 మంది మహిళలు ఉన్నారు. 2001 జనాభా లెక్కల కంటే 10.76 శాతం 2011లో పెరిగారు.

త్వరలో శిక్షణ 
2021 సెన్సెస్‌లో భాగంగా జిల్లాలో నలుగురు మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ ఇప్పించాము. వీరు జనవరి, ఫిబ్రవరి నెలల్లో జిల్లాలోని 130 మంది ఫీల్డ్‌ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన ఫీల్డ్‌ ట్రైనర్లు అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లోని ఏడు వేల మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. జనాభా లెక్కల సేకరణ కోసం ఇంటింటికి వచ్చే అధికారులకు ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటరు గుర్తింపుకార్డులు వంటి వివరాలను ప్రజలు సమర్పించి సహకరించాలి. ఇంకా ప్రభుత్వం నుంచి నియమ నిబంధనలు రావాల్సి ఉంది.  – వి.తిప్పేస్వామి, చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్, కడప

మరిన్ని వార్తలు