దూసుకొస్తున్న ‘ఫణి’

27 Apr, 2019 12:48 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఇంతియాజ్,చిత్రంలో జేసీ కృతికా శుక్లా తదితరులు

తుపానును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలి

28, 29, 30 తేదీల్లో జిల్లాపై ప్రభావం    చూపే అవకాశం

కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌

ముందస్తు చర్యలపై జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం

విజయవాడ: ఫణి తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో తుపాను ముందస్తు చర్యలపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్‌  మాట్లాడుతూ ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలోపేతమై మచిలీపట్నం వైపునకు ఫణి తుపానుగా దూసుకొస్తోందన్నారు. రానున్న 72 గంటల్లో వాయుగుండం ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతానికి చేరుకుంటుందన్నారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో జిల్లాపై ఈ ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసిందన్నారు. ఈ ప్రభావంతో గంటకు 40 నుంచి 50కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలుస్తోందన్నారు.

తుపాను ప్రభావిత మండలాల్లో హై అలర్ట్‌
ఈ నేపథ్యంలో జిల్లాలో ముఖ్యంగా తుపాను ప్రభావిత మండలాలైన మచిలీపట్నం, నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి, అవనిగడ్డ, మోపిదేవిలతో పాటు 16 ముంపు మండలాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక అధికారులను నియమించామని  చెప్పారు.

137 కమ్యూనిటీ రేడియో సెట్లతో..
జిల్లా వ్యాప్తంగా 137 కమ్యూనిటీ రేడియో సెట్ల ద్వారా తుపాను ప్రభావిత మండలాల్లో మత్స్యకారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ అప్రమత్తం చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదే«శించామన్నారు. అన్ని రెవెన్యూ డివిజినల్, తహసీల్దార్‌ కార్యాలయాల్లో వైర్‌లెస్‌ సెట్లు, హోం రేడియోలతో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వాస్పత్రులు, రక్షిత మంచినీటి సరఫరా కేంద్రాల వద్ద జనరేటర్లతో సిద్ధంగా ఉండాలని విద్యుత్‌ శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. మున్సిపల్‌ అథారిటీ, పంచాయతీ అధికారులు ఓవర్‌హెడ్‌ ట్యాంకులను తాగునీటితో నింపుకోవాలని కలెక్టర్‌ సూచించారు. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడితే తాగునీటికి ఇబ్బంది లేకుం డా డీజిల్‌ జనరేటర్‌లను సిద్ధం చేసుకోవాలన్నారు. 

వరి పైరును రక్షించేందుకు..
జిల్లాలో పంట దశలో ఉన్న 7వేల హెక్టార్ల వరిపైరును రక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యానికి టార్పాలిన్‌ కప్పి ఉంచే విధంగా రైతులను అప్రమత్తం చేయాలన్నారు. మామిడి, ఉద్యానవన పంటల రైతులకు తుపాను పరిస్థితిని వివరించి అప్రమత్తం చేయాలన్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల వద్ద వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని అత్యవసర మందులను కూడా సిద్ధం చేయాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా, సబ్‌–కలెక్టర్లు మిషాసింగ్, స్వప్నిల్‌ దినకర్, జేసీ–2 పి.బాబూరావు, డీఆర్వో ఏ.ప్రసాద్, జెడ్పీ సీఈఓ షేక్‌సలాం, ఆర్డీఓలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు