బాల్య వివాహాన్ని ఆపలేక పోయిన అధికారులు

12 May, 2018 12:48 IST|Sakshi

నోటీసులు జారీ చేసిన డీఎల్‌ఎస్‌ఏసెక్రటరీ, జడ్జి యుయు ప్రసాద్‌

15న డీఎస్‌ఎస్‌ఏ ముందుహాజరు కావాలని ఆదేశాలు

లీగల్‌ (కడప అర్బన్‌):  చాపాడు మండలం పెద్ద గురువలూరుకు చెందిన కుచ్చుపాప లింగమ్మ, వీరయ్యల కుమారుడు వీరమోహన్‌ అల్లాడుపల్లెలోని శ్రీ వీరభద్ర దేవస్థానంలో 18 సంవత్సరాలు నిండని బాలికను వివాహం చేసుకున్నాడు. బాలల ఉచిత సహాయం నెంబర్‌–1098కు అక్కడ వివాహం జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఆ సమాచారాన్ని సంబంధిత అధికారులకు పంపారు. కానీ బాల్య వివాహ నిరోధక అధికారులు ఆ వివాహాన్ని సకాలంలో అడ్డుకోలేకపోయారు. బాల్య వివాహాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు కూడా అధికారులు తీసుకోకపోవడంతో గర్ల్‌ అడ్వకసీ అలయన్స్‌ నెట్‌ వర్క్‌ సభ్యుడు, ఆల్‌షిఫా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు షేక్‌ మహ్మద్‌ రఫి లోక్‌ అదాలత్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ, జడ్జి యుయు ప్రసాద్‌ పిఎల్‌సి(ప్రీ లిటిగేషన్‌ కేసు) నెం. 631/2018గా నమోదు చేశారు.

అధికారులకు నోటీసులు జారీ  
ఈ సంఘటనకు బాధ్యులైన ఐసీడీఎస్‌ పీడీ జమ్మలమడుగు ఆర్డీఓ, ప్రొద్దుటూరు డీఎస్పీ, చాపాడు తహసీల్దార్, అల్లాడుపల్లె వీరభద్రస్వామి దేవస్థానం ఈఓ, బాలిక తండ్రి, పెండ్లికుమారుడు, అతని తండ్రికి జడ్జి యుయు ప్రసాద్‌ నోటీసులను జారీ చేశారు. ఈనెల 15న జిల్లా కోర్టులోని లోక్‌ అదాలత్‌ భవన్‌లో హాజరు కావాలని ఆయన ఆదేశించారు.

మరిన్ని వార్తలు