వామ్మో..ఆత్మకూరు బస్టాండ్‌!

20 Feb, 2019 11:23 IST|Sakshi
విరిగిన కుర్చీలు

తీవ్ర మంచినీటి ఎద్దడి అధ్వానంగా మరుగుదొడ్లు

విరిగిన కుర్చీలు ఇబ్బందుల్లో ప్రయాణికులు  

శివస్వాములకు తప్పని ఇక్కట్లు

కర్నూలు , ఆత్మకూరు: మహాశివరాత్రి పర్వదినం వస్తోం దంటే అందరికీ గుర్తుకు వచ్చేది శ్రీశైల మహాక్షేత్రం. బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు క్షేత్రానికి తరలి వస్తుంటారు. జిల్లా వాసులే కాకుండా కన్నడిగులు సైతం మల్లన్నను దర్శించుకునేందుకు వెళ్తుంటారు. వీరు ముందుగా ఆత్మకూరు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే వేలాది మంది భక్తులకు అనుగుణంగా ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సరైన సౌకర్యాలు లేవు. ఈ నెల 25 నుంచి శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైల క్షేత్రంలో భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆత్మకూరులోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించడం లేదు. 

ఆత్మకూరులో ఆర్టీసీ డిపో 1972లో ఏర్పడింది.
జిల్లాలోనే అత్యధికంగా లాభాలు తెచ్చేదిగా పేరుంది. ప్రతి రోజు ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి 10 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. బస్టాండ్‌లో కుళాయిలు ఉన్నా..వాటిలో మంచి నీరు రాదు. నీటి సమస్య తీర్చేందుకు అధికారులు డిపో ఆవరణలో బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రయాణికులకు దాహం వేస్తే లీటర్‌ నీళ్ల బాటిల్‌ రూ.20 చెల్లించి కొనాల్సిందే. నగర పంచాయతీ అధికారులకు ఆర్టీసీ వారు నీటి పన్నులు చెల్లిస్తున్నా..తగినన్ని కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. ట్యాంకర్లతో నీటిని కొని  బస్టాండ్‌ను శుభ్రం చేయాల్సి వస్తోంది. మేజర్‌ గ్రామ పంచాయతీ ఉన్న సమయంలో నీటి సరఫరా బాగా ఉండేదని, నగర పంచాయతీగా ఏర్పడిన తరువాత ఇబ్బందులు వస్తున్నాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 

శివస్వాముల అవస్థలు
కఠిన దీక్షతో శివమాల ధరించిన శివస్వాములు ఆత్మకూరు బస్టాండ్‌లో మంచినీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూరుకు వచ్చిన శివస్వాములుకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు బస్సు సౌకర్యం లేదు. దీంతో బస్టాండ్‌ ప్రాంగణంలోనే నిద్రించే పరిస్థితి ఉంది. నేలపైనే శివస్వాములు నిద్రించడంతో పాటు.. మరుగుదొడ్లు కూడా సరిగా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  

తగ్గిన సర్వీసులు..
 ఆత్మకూరు డిపోలో 600 మందికిపైగా కార్మికులు విధులు నిర్వహించే వారు. దాదాపు 15 సంవత్సరాల పాటు అత్యధిక ఆదాయ డిపోగా గుర్తింపు పొందింది. శ్రీశైల క్షేత్రమేగాక కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలకు ఇక్కడ నుంచి బస్సుల సౌకర్యం ఉండేది. అయితే 2010 నుంచి ఆదాయం తగ్గడంతో సర్వీసులు తొలగించారు. ఆత్మకూరు నుంచి శ్రీశైల క్షేత్రానికి కేవలం 2 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. అదనపు సర్వీసులు వేయాలని భక్తులు కోరుతున్నా ఆర్టీసీ అధికారుల్లో చలనం లేదు.   

‘మరుగు’న పడేశారు  
బస్టాండ్‌ ఆవరణలో మరుగుదొడ్ల పరిస్థితి అధ్వాంగా ఉంది. సరైన నీరు లేకపోవడం, దుర్వాసన వస్తుండడం..తదితర కారణాలతో నూతనంగా ఏర్పాటు చేసిన వాటిని మూసివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌లో కుర్చీలు సరిగా లేవు. ప్రయాణికులు మెట్లపైనే   కూర్చునే పరిస్థితి నెలకొంది. రాత్రి వేళ శ్రీశైలానికి వెళ్లే బస్సులు ఆత్మకూరులోనే ఉంటున్నాయి. ప్రయాణికులు నిద్రించేందుకు కావాల్సిన సౌకర్యాలు లేవు. దోమల బెడదతో కంటికి కునుకు కరువవుతోంది. 

 ఆత్మకూరు డిపోలో ఉన్న బస్సు సర్వీసులు –69
 సిబ్బంది: కండక్టర్లు–110, డ్రైవర్లు–92,  గ్యారేజ్‌లో కార్మికులు–40 

మరిన్ని వార్తలు