సిగ్గు.. సిగ్గు

17 Feb, 2019 08:34 IST|Sakshi
కుక్కునూరు హౌసింగ్‌ కార్యాలయం.

అధికార పార్టీకి తొత్తులుగా ప్రభుత్వ యంత్రాంగం

కుక్కునూరు హౌసింగ్‌ కార్యాలయంలో తీరు

అండ చూసుకుని బరితెగింపు

టీడీపీ మార్క్‌ పాలన ఎలా ఉంటుందో కుక్కునూరు హౌసింగ్‌కార్యాలయంలో మరోసారి బయటపడింది. అధికార పార్టీకి తొత్తులుగామారిన ఆ కార్యాలయం ఉద్యోగులు టీడీపీ నాయకులను తీసుకొస్తేనే కానీఇంటి కోసం దరఖాస్తు తీసుకునేందుకు నిరాకరించే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటుగా వాళ్ల బరితెగింపు ఉంది. ఎప్పుడూ ఇదే పార్టీ పాలనలో ఉంటుందా అనే స్పృహ కూడా వాళ్లకు లేదా అనే అనుమానం కలుగుతోంది.

కుక్కునూరు: ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొనేందుకు కుక్కునూరు హౌసింగ్‌ కార్యాలయానికి శనివారం వెళ్లిన నిరుపేదలకు చేదు అనుభవం ఎదురైంది. అందరిని సమ దృష్టితో చూడాల్సిన ఉద్యోగులు దరఖాస్తులు ఇవ్వబోయిన నిరుపేదలను టీడీపీ నాయకులను తీసుకొస్తేనే దరఖాస్తులు స్వీకరిస్తామంటూ కార్యాలయం నుండి బయటకు గెంటేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ఇళ్లులేని పేదలకు ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అర్హుల నుంచి హౌసింగ్‌ అధికారులు దరఖాస్తులు స్వీకరించి ఆన్‌లైన్‌ చేస్తున్నారు. శనివారం కుక్కునూరులోని కిష్టారం కాలనీకి చెందిన పలువురు నిరుపేదలు ఇంటి కోసం దరఖాస్తులు సమర్పించేందుకు వెళ్లారు, అలా వెళ్లిన వారిని హౌసింగ్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న జగదీష్‌ అనే ఉద్యోగి టీడీపీ నాయకులను తీసుకొస్తేనే పై అధికారులు దరఖాస్తులు తీసుకోమన్నారని  చెబుతూ తమను బయటకు గెంటేశారని పేదలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే చెప్పిన వారికే ఇళ్లు
హౌసింగ్‌ కార్యాలయ ఉద్యోగి దరఖాస్తులు తీసుకోకపోవడంతో అదేంటని అడుగుతుండగా ఇంతలో అక్కడికి చేరుకున్న అధికారపార్టీ నాయకుడు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారితో మాట్లాడుతూ.. మీరు వైఎస్సార్‌ సీపీ జెండాలు పట్టుకొని తిరిగారని, మీకు ఇళ్లు ఎలా వస్తాయన్నారు. స్థానికంగా ఉన్న టీడీపీకి చెందిన రాజుగారు వద్దకు వెళ్లి ఎమ్మెల్యేతో చెప్పించుకుంటేనేగానీ ఇళ్లు మంజూరు కావని చెప్పాడని బాధితులు వాపోతున్నారు.

విలేకరిని బెదిరించే యత్నం
ఇదిలా ఉండగా తమకు జరిగిన అన్యాయాన్ని బాధితులు స్థానిక ‘సాక్షి’ విలేకరికి చెప్పడంతో ఆయన వచ్చి సదరు ఉద్యోగిని ‘టీడీపీ నేతలను తీసుకొస్తేనే దరఖాస్తులు స్వీకరించమంటూ మీకు ఎక్కడినుంచి ఆదేశాలొచ్చాయో చెప్పాలి’ అంటూ ప్రశ్నించటంతో సదరు ఉద్యోగి ‘నీ పద్ధతి బాగోలేదు’ అని విలేకరిని బెదిరించే ప్రయత్నం చేయటం కొసమెరుపు.

నీకేమీ కాదంటూ పచ్చనేత హామీ
బాధితులకు అండగా వచ్చిన వైఎస్సార్‌ సీపీ నేతలు మాట్లాడుతుండగా పలువురి దరఖాస్తులను పట్టుకుని అక్కడకు చేరుకున్న  అధికార పార్టీ నాయకుడికి ఉద్యోగి జరిగిన విషయం చెప్పారు. ఆయన నీ ఉద్యోగానికి ముప్పేమీ లేదని, అంతా నేను చూసుకుంటానని చెప్పాడు. తాను చెప్పిన వారికే ఇళ్లు మంజూరు చెయ్యమంటూ హుకుం జారీ చేశాడు. ఎవరు ఫోన్‌ చేసినా తన ఫోన్‌ నంబర్‌ ఇవ్వమంటూ, అతని ఫోన్‌ నంబర్‌ను ఉద్యోగికి ఇచ్చాడు. అధికార పార్టీ నాయకులు సొంతగూడు కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలపై కక్ష సా«ధింపు చర్యలు చేపడుతున్నారని పలువురు ఆరోపించారు. పేదవాడి ఇంటికి రాజకీయాన్ని ముడిపెడుతున్న ఈ అధికార పార్టీ మూల్యం చెల్లించకతప్పదని, ఈ రాబందుల పాలన ముగిసే రోజులు  దగ్గరపడ్డాయని పలువురు వాఖ్యానించారు.

మరిన్ని వార్తలు