‘పుర’ పోరుకు సన్నాహాలు

4 Feb, 2020 04:01 IST|Sakshi

ఓటర్ల జాబితాలు విడుదల 

రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేసిన అధికారులు 

ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధంగా అధికార యంత్రాంగం

సాక్షి, అమరావతి: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలలో ఓటర్ల జాబితాలను ఇప్పటికే దాదాపుగా ఖరారు చేశారు. రాష్ట్రంలోని 16 నగర పాలక సంస్థలకుగానూ కాకినాడకు 2017లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాల్సిన మిగతా 15 నగర పాలక సంస్థల్లో ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేశారు. 88 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఓటర్ల జాబితాను కూడా విడుదల చేశారు. మరో 6 మున్సిపాలిటీలలో ఓటర్ల జాబితాను మంగళవారం విడుదల చేస్తారు. దీంతో అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితా తయారీ పూర్తి కానుంది. ఓటర్ల జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు ఉంటే రిటర్నింగ్‌ అధికారులుగా ఉన్న ఆర్డీవోల దృష్టికి తేవచ్చు. అనంతరం ఓటర్ల జాబితాలను అధికారులు ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు. ఇక కొత్తగా ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన 12 మున్సిపాలిటీలలో కూడా ఓటర్ల జాబితా తయారీ దాదాపుగా పూర్తైంది. వీటిని ఏర్పాటు చేస్తూ అధికారికంగా ప్రకటన విడుదలైన వెంటనే ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పించాలని అధికారులు భావిస్తున్నారు. 

రిజర్వేషన్ల ఖరారు దిశగా...
నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఓటర్ల సర్వే తుది అంకానికి చేరుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీలవారీగా ఓటర్ల సర్వే పూర్తి చేశారు. తదనుగుణంగా నగర పాలక సంస్థల్లో కార్పొరేటర్లు, మున్సిపాలిటీలలో కౌన్సిలర్ల రిజర్వేషన్లకు ప్రాథమిక కసరత్తు చేపట్టారు. రాష్ట్రం యూనిట్‌గా మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లను నిర్ణయిస్తారు. నిబంధనల మేరకు రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. అనంతరం ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు.

ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు ఎప్పుడైనా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు రూ.60 కోట్లు విడుదల చేసింది. నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలలో వార్డుల పునర్విభజన కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్నికల అధికారుల నియామక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. కొత్తగా ఏర్పాటు చేసే మున్సిపాలిటీల వార్డుల పునర్విభజన, ఎన్నికల అధికారుల నియామకం దాదాపు ఓ కొలిక్కి వచ్చిందని చెబుతున్నారు. మార్చి మొదటి వారంలో ఎన్నికల నిర్వహణ దిశగా పురపాలక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఎన్నికల నిర్వహణకుసన్నద్ధం: విజయ్‌కుమార్, పురపాలక శాఖ  కమిషనర్, డైరెక్టర్‌
‘నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఓటర్ల జాబితాలను పూర్తి చేశాం. ఓటర్ల సర్వే చేసి తదనుగుణంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోపాటు మేయర్లు, చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు నిర్ణయించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నాం’ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు