కరోనా: కాంటాక్టులకు కళ్లెం

15 Apr, 2020 09:27 IST|Sakshi
విజయవాడ రాణీగారితోట ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్వాబ్‌ కేంద్రానికి పరీక్ష కోసం వచ్చిన ప్రజలు

రోజుకు వెయ్యి శాంపిల్స్‌ సేకరణ 

మంగళవారం మూడు ప్రాంతాల్లో నిర్వహణ  

జిల్లాలో నాలుగు ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు

విజయవాడలో మరో 8 మందికి పాజిటివ్, జిల్లాలో 44కు చేరిన కేసులు

ప్రపంచ మహమ్మారిగా మారి, ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి  ప్రభుత్వ యంత్రాంగం నిరంతర, నిర్మిరామ యుద్ధం చేస్తోంది. జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదైన  ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాలను జోన్‌లుగా విభజించి మహమ్మారి కట్టడికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పాజిటివ్‌ వ్యక్తుల కాంటాక్ట్‌లను ఇప్పటికే క్వారంటైన్‌కు తరలించిన అధికారులు..సెకండరీ కాంటాక్ట్‌ల గుర్తింపులో నిమగ్నమయ్యారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు  ఏర్పాటు చేసి పరీక్షలను ముమ్మరం చేశారు. 

లబ్బీపేట, మచిలీపట్నం: కరోనా కట్టడికి ప్రభుత్వ యంత్రాంగం విశేషంగా కృషి చేస్తుం ది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారిని, ఢిల్లీ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారు, వారి కాంటాక్ట్స్‌ను గుర్తించి,  క్వారంటైన్‌లో ఉంచిన అధికారులు, ప్రస్తుతం కాంటాక్ట్‌ల నుంచి వ్యాప్తిపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం నగరంలో పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించగా, ఆయా ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కరోనా లక్షణాలు ఉన్న వారందరికీ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారితో పాటు, కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నా, దగ్గరగా ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక చాంబర్‌లు ఏర్పాటు చేసి శాంపిల్స్‌ను సేకరిస్తున్నారు. 

రెండు ప్రాంతాల్లో పరీక్షలు.. 
కరోనా నిర్ధారణ పరీక్షలను సోమవారం రాణీగారితోట, కుమ్మరిపాలెంలో నిర్వహించగా, మంగళవారం మరో రెండు  ప్రాంతాల్లో నిర్వహించారు. రెడ్‌సర్కిల్‌ సమీపంలోని బిషప్‌ అజరయ్య స్కూల్‌ ప్రాంగణంతో పాటు, ఖుద్ధూస్‌నగర్‌లోని ఉన్నత పాఠశాలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేసారు. ఆయా శిబిరాల్లో స్వచ్ఛందంగా వచ్చిన వారితో పాటు, రెడ్‌జోన్‌లలో వలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది నిర్వహిస్తున్న సర్వేలో లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారి నుంచి కూడా శాంపిల్స్‌ను సేకరిస్తున్నారు. వాటిని సిద్ధార్థ వైద్య కళాశాలలోని వైరల్‌ల్యాబ్‌కు తరలిస్తున్నారు. ఈ పరీక్షలో పాజిటివ్‌ వచ్చినవారిని ఐసోలేషన్‌ వార్డులకు తరలించి చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు.  

జిల్లాలో నాలుగు పరీక్ష ల్యాబ్‌లు  
జిల్లాలో నాలుగు చోట్ల ‘ట్రూ నాట్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌(కోవిడ్‌–19)లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వు లు జారీ చేసింది. మచిలీపట్నం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, నూజివీడు ఏరియా ఆస్పత్రి, గన్నవరంలోని వెటర్నరీ ఆస్పత్రి, విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలను ఎంపిక చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

మరో 8 కొత్త కేసులు... 
విజయవాడలో మంగళవారం మరో 8 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ రోగులకు సంఖ్య 44కు చేరింది. కాగా మంగళవారం ప్రకటించిన కొత్త కేసుల్లో కొత్తపేటకు చెందిన ఇద్దరు, సీతారామపురంకు చెందిన ఇద్దరు, మారుతీనగర్‌ కారి్మకనగర్‌కు చెందిన ఇద్దరు, గుణదల గంగిరెద్దుల దిబ్బ, అమ్మ కల్యాణ మండపం ప్రాంతానికి చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. కాగా సీతారామపురం, కొత్తపేటలో నమోదైన కేసులు కాంటాక్టు కేసులుగా వైద్యాధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో నమోదైన పాజిటివ్‌ కేసుల నుంచి వారికి సోకినట్లు చెబుతున్నారు. కాగా కారి్మకనగర్, గంగిరెద్దుల దిబ్బ, అమ్మ కళ్యాణమండపం ప్రాంతంలో నమోదైన నలుగురికి కాంటాక్టులు తెలియలేదు. వారికి ఎవరి నుంచి వ్యాధి సోకిందనే దానిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా వారి నుంచి ఇంకెవరికైనా సోకిందా అనే కోణంలో కూడా పరిశీలన జరుపుతున్నారు.           సెకండరీ కాంటాక్ట్‌ల గుర్తింపులో అధికారులు 

ఈ 18 రోజులు కీలకం
సాక్షి, కృష్ణా: జిల్లాలో కోవిడ్‌–19 కేసులు పెరుగుతుండటంతో వచ్చే 18 రోజులు ఎంతో కీలకం. ప్రజలు తమ ఇళ్లకే పరిమితం కావాలని జిల్లా యంత్రాంగం చెబుతోంది. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల అధికారులు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రజలు తమ బాధ్యతగా అధికార యంత్రాంగానికి సహకారం అందించాలంటోంది. అలాగే రెడ్‌జోన్లలో ఉన్న వారు నిబంధనల్ని ఉల్లంఘించరాదని విజ్ఞప్తి చేస్తోంది. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. మాంసం దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా ఉండకుండా కనీసం భౌతిక దూరం పాటించాలని, ఒకసారి బయటకు వస్తే.. వారం రోజులకు సరిపోయే కూరగాయలు కొనుగోలు చేసుకోవాలని, ప్రజలందరూ తమ బాధ్యతను గుర్తించుకొని ఇంట్లోనే ఉండాలని కోరుతోంది.

క్వారంటైన్‌ సెంటర్‌ పరిశీలన 
గన్నవరం: స్థానిక ఎనీ్టఆర్‌ పశువైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌ను మంగళవారం రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పరిశీలించారు. క్వారంటైన్‌లో ఉన్న 67 మందికి కలి్పస్తున్న సదుపాయల గురించి ఆయన వాకబు చేశారు. తొలుత పీపీఈ సూట్‌ ధరించిన మంత్రి క్వారంటైన్‌ సెంటర్‌లోకి వెళ్లారు. అక్కడ క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులతో మాట్లాడిన నాని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముడా వీసీ విల్సన్‌బాబు, కేంద్రం ఇన్‌చార్జి రవికుమార్, తహసీల్దారు వి. మురళీకృష్ణ, వైద్యులు డాక్టర్‌ కిశోర్‌కుమార్, కేసరపల్లి ఈవో వై. రాజారావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు