జంఝావతి అందనీరు

2 Mar, 2016 23:48 IST|Sakshi

 గరుగుబిల్లి: ఆలోచన మంచిదే గానీ... ఆచరణలోనే విఫలమయ్యారు. సాగునీటి సరఫరాకు చేసిన పనుల్లో లోపాలు రైతులకు శాపంగా పరిణమించింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల వేలాది ఎకరాల శివారు భూములకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డ్యాం నుంచి పార్వతీపురం, అడ్డాపుశీల మీదుగా గరుగుబిల్లి మండలంలోని సీతారాంపురం, ఉల్లిభద్ర, టీఆర్‌ఎన్‌వలస, గొల్లవానివలస, గొట్టివలస, గరుగుబిల్లి, పెద్దూరు తదితర గ్రామాల చెరువులను కలుపుతూ 2005న కాలువలు ఏర్పాటుచేశారు.
 
  ఈ విధంగా మండలంలోని ఐదువేల ఎకరాలకు జంఝావతినీటిని అందించేందుకు నిర్ణయించారు. బాలగుడబ మీదుగా పెదగుడబ, వల్లరగుడబ, సన్యాసిరాజుపేట పంటపొలాలను కలుపుతూ గంగసాగరం చెరువు, కృష్ణసాగరం చెరువులను అనుసంధానం చేస్తూ కాలువలను ఏర్పాటు చేశారు. ఈ కాలువలు హైలెవెల్‌లో వుండటంతోపాటు సాగునీరు కాలువలద్వారా సరఫరా కాకపోవడంతో పంటపొలాలకు నీరందని పరిస్థితి నెలకొంది.
 
 అక్విడెక్టు నిర్మించినా...
 రైతుల అభ్యర్థన మేరకు గత ఏడాది మండలంలోని ఉల్లిభద్ర గ్రామసమీపంలోని తోటపల్లి కుడి ప్రధాన కాలువపై అక్విడెక్టు నిర్మించారు. అందులోనూ లోపాలుండటంతో సాగునీరు సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. కొన్నేళ్ళుగా కాలువ అసంపూర్తిగా ఉండటంతో ఈప్రాంత రైతులు పంటలు పండించలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని జిల్లాకలెక్టర్ దృష్టికి స్థానిక నాయకులు తీసుకెళ్లగా నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా కాలువలను అభివృద్ధిచేసేందుకు రూ.26 కోట్లు మంజూరైంది. ఈ నిధులతో తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధానకాలువ పరిధిలోని ఉల్లిభద్రవద్ద గతంలో నిర్మించిన అక్విడెక్టు నిర్మాణంలో స్వల్పవ్యత్యాసాన్ని సరిచేయడంతోపాటు కొత్తగా నిర్మించిన ఆక్విడెక్టుకు ఎగువ భాగంలో 561మీటర్లు, దిగువభాగంలో 150మీటర్లు కాలువల్లోని పూడికలను తొలగించి, గట్లు నిర్మించారు. ప్రస్త్తుతం కాంక్రీట్ కల్వర్టు పనులు చేపడుతున్నా అవి మందకొడిగా సాగుతున్నాయి.
 
 ఆధునీకరణ లేక అవస్థలు
 ఏన్నో ఏళ్ళుగా కాలువలు నిర్వాహణ లేకపోవడంతో పలుచోట్ల మూసుకొనిపోయాయి. తూములు శిధిలావస్థకు చేరుకున్నాయి. అడ్డాపుశీలనుంచి కాలువలను ఆధునీకరిస్తే సాగునీరు సరఫరా అయ్యేందుకు వీలుంటుందని రైతులు అంటున్నారు. కాలువలద్వారా సాగునీరు సరఫరా కాకపోవడంతో ఉల్లిభద్ర, సీతారాంపురం, టీఆర్‌ఎన్‌వలస, గొట్టివలస, గరుగుబిల్లి, పెద్దూరు, దళాయివలస తదితర గ్రామాల్లోని మెట్టుభూముల్లో గిట్టుబాటు కానప్పటికీ గోగుపంటను పండిస్తున్నారు. సాగునీరు సరఫరా అయితే మెట్టుభూముల్లో పంటలను పండించుకునేందుకు అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు