క్షణక్షణం.. అప్రమత్తం

2 Apr, 2020 11:58 IST|Sakshi

బుధవారం మరో 11 మందికి కరోనా పాజిటివ్‌

జిల్లాలో 20కి చేరిన కేసులు

మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన  వారికి క్వారంటైన్‌

మరికొంత మంది  ఆచూకీ కోసం గాలింపు

సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, గుంటూరు: జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 11 కేసులు నమోదవడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఇందులో గుంటూరులో 5, అచ్చంపేటలో 3, క్రోసూరులో 1, మంగళగిరిలో 1, మాచర్లలో 1 కేసు వెలుగు చూసింది. ఇందులో పది మంది ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారు కాగా, మరొకరు గతంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి భార్య. దీంతో ఇంతకు ముందు తొమ్మిది కేసులతో కలిపి మొత్తంగా జిల్లాలో కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య 20కు చేరుకుంది.  ఈ క్రమంలో ఢిల్లీ మతప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం అన్వేషణ కొనసాగిస్తోంది.

మంగళవారం నాటికి ఢిల్లీ నుంచి వచ్చిన వారు 184 మందిగా గుర్తించినప్పటికీ ఇంకా వారిలో కొంత మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఇందులో ఇతర దేశాల నుంచి కొంత మంది వచ్చినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు వారి కోసం జల్లెడపడుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారు ఇప్పటి వరకు 280 మందిని కలిసినట్టు తేల్చగా, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య సేవలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే కరోనా ప్రభావిత ప్రాంతాలైన గుంటూరు మంగళదాస్‌నగర్, ఆనందపేట, సంగడిగుంట, మాచర్ల మున్సిపాలిటీ, కారంపూడిలో పెస్టిసైడ్‌ ఇండియా రూపొందించిన  యంత్రంతో  సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. తాజాగా  బుధవారం ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి సంఖ్య 259గా  పోలీసులు నివేదికలు చెబుతున్నాయి.

68 క్వారంటైన్‌ సెంటర్లు సిద్ధం
జిల్లాలో ఇప్పటికి 68 క్వారంటైన్‌ సెంటర్లు అధికారులు గుర్తించారు. వాటిలో 9వేల బెడ్‌లు సిద్ధం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనిమిది క్వారంటైన్‌ సెంటర్లు పనిచేస్తున్నాయి. ప్రధానంగా ఢిల్లీ మతప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కాంటాక్ట్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టారు. ఈ క్వారంటైన్‌ సెంటర్లలోనే కరోనా అనుమానితులకు శాంపిళ్లను తీసి వాటిని ల్యాబ్‌కు పంపేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
కరోనా నివారణకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రధానంగా కరోనా ప్రభావిత ప్రాంతంలో పారిశుద్ధ్యంతో పాటు, ఆయా ప్రాంతాల్లో పూర్తిగా లాక్‌డౌన్‌ విధించారు.   – ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్, కలెక్టర్‌ 

>
మరిన్ని వార్తలు